ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలి

contract outsourcing employees demand AP

ముఖ్యమంత్రికి ఆప్కాస్‌ ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ లేఖ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో పనిచేస్తున్న ఆప్కాస్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్‌ చేయాలని, ఈలోగా కాంట్రాక్టు పద్ధతిలోకి మార్చాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆప్కాస్‌ ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ కోరింది. ఈ మేరకు ముఖ్యమంత్రికి బుధవారం ఫెడరేషన్‌ గౌరవాధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు పి వెంకటసుబ్బయ్య, రజిని లేఖ రాశారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులందరికీ మినిమం టైంస్కేల్‌ అమలు చేయాలని, మూడేళ్లు పూర్తి చేసుకున్న వారిని కాంట్రాక్టులోకి మార్చాలని, సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. ప్రతి ఆరు నెలలకూ కరువుభత్యం చెల్లించి, సిక్‌ లీవులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కారుణ్య నియామకాలు ఇవ్వాలని, రిటైర్మెంట్‌ వయసు 62 ఏళ్లకు పెంచాలని కోరారు. ఆప్కాస్‌లో చేర్చని వారిని అందులో చేర్చాలని, శానిటేషన్‌, సెక్యూరిటీ, తదితర ఏజెన్సీలను రద్దుచేసి ఉద్యోగులందరినీ ఆప్కాస్‌లో చేర్చి వారందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. అలాగే 2014 నుంచి పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయడాన్ని ఫెడరేషన్‌ తరపున స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. అదే పద్ధతిలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులనూ చేర్చాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు 17 ఏళ్ల నుంచి చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నారని, ఉద్యోగం ఎప్పుడు పోతుందో కూడా తెలియని అభద్రతాభావంలో పనిచేస్తున్నారని వివరించారు. ఆప్కాస్‌ను తీసుకురావడం వల్ల దళారులు లేకుండా చేశారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందరినీ రెగ్యులరైజ్‌ చేస్తుందన్న ఆశతో ఎదురుచూస్తున్న సమయంలో తక్కువ వేతనాలతో కూడిన జిఓ ఇచ్చారని, ఇప్పటికైనా స్పందించి వారికి న్యాయం చేయాలని కోరారు.

➡️