స్టేడియాలను ప్రయివేటీకరించొద్దని ఆందోళన

Nov 30,2023 09:09 #Privatization, #Protest, #visakhapatnam
warva protest against sports areana privatization

ప్రజాశక్తి- కలెక్టరేట్‌ (విశాఖ) : విశాఖ నగరంలోని స్పోర్ట్స్‌ ఎరీనాలు, స్టేడియాల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా విశాఖపట్నం అపార్ట్‌మెంట్స్‌ రెసిడెన్షియల్‌ కాలనీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ (వార్వా), నివాస్‌ ఆధ్వర్యాన బుధవారం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వార్వా అధ్యక్షులు ఎన్‌.ప్రకాశరావు, నివాస్‌ అధ్యక్షులు పిట్టా నారాయణమూర్తి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగరంలోని పోర్టు స్టేడియం, ఎంవిపి.కాలనీలోని ఇండోర్‌ స్టేడియం, బీచ్‌లోని అక్వా స్పోర్ట్స్‌ స్టేడియం, కైలాసగిరి వాకర్స్‌ ట్రాక్‌ తదితర రూ.వందల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను కారు చౌకగా ప్రయివేటు వ్యక్తులకు అప్పగించడం దుర్మార్గమన్నారు. ఇప్పటికే పోర్టు స్టేడియంలో నిర్వహిస్తోన్న క్రీడలకు ప్రయివేటు వారు వేలకు వేల రూపాయలు అద్దెల రూపంలో వసూలు చేస్తున్నారని, ఇది మధ్యతరగతి, సాధారణ ప్రజానీకానికి అందుబాటులో లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే స్టేడియంలోకి వెళ్లేందుకు పెట్టిన ఎంట్రీ ఫీజు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉన్నత వర్గాలకు ఉపయోగపడే ఈ చర్యలను విద్యార్థులు, యువకులు, ప్రజానీకం అందరూ వ్యతిరేకించాలని, ప్రయివేటీకరణ నిర్ణయాలు వెనక్కు తీసుకునే విధంగా ఆందోళన చేపట్టాలని కోరారు. ప్రయివేట్‌ కాంట్రాక్టర్లతో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. నిరసనలో నాయుడుబాబు, హరిప్రసాద్‌, పులి గురప్ప, కిరీటం, లచ్చిరాజు తదితరులు పాల్గొన్నారు.

➡️