ఐరాస జనరల్ అసెంబ్లీ తీర్మానానికి అనుకూలంగా భారత్ ఓటు
న్యూయార్క్ : సిరియన్ గోలన్ హైట్స్ నుండి ఇజ్రాయిల్ వైదొలగకపోవడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ (యుఎన్‌జిఎ) రూపొందించిన ముసాయిదా తీర్మానానికి అనుకూలంగా భారత్ ఓటు వేసింది. సిరియాలోని వాయువ్య ప్రాంతమైన గోలన్ హైట్స్‌ను 1967లో ఆరు రోజుల పాటు జరిగిన యుద్ధంలో ఇజ్రాయిల్ ఆక్రమించుకుంది. మధ్య ప్రాచ్యంలో పరిస్థితి అన్న పేరుతో రూపొందించిన ఈ తీర్మానంపై మంగళవారం ఓటింగ్ జరిగింది. ఈజిప్ట్ దీన్ని ప్రవేశపెట్టగా 91 దేశాలు అనుకూలంగాను, 8 దేశాలు వ్యతిరేకంగాను ఓటు వేశాయి. మరో 62 దేశాలు గైర్హాజరయ్యాయి. భారత్‌తో పాటూ చైనా, రష్యా, దక్షిణాఫ్రికా సహా పలు దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్, అమెరికా, ఇజ్రాయిల్‌లు వ్యతిరేకంగా ఓటు వేశాయి. 1967 నుండి తన అదుపులో వున్న సిరియన్ గోలన్ ప్రాంతం నుండి ఇజ్రాయిల్ వైదొలగకపోవడం పట్ల తీర్మానం తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది. భద్రతా మండలి, జనరల్ అసెంబ్లీ తీర్మానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని పేర్కొంది. ఆక్రమించిన సిరియన్ గోలన్ ప్రాంతంలో తన చట్టాలు అమలు చేసేందుకు ఇజ్రాయిల్ తీసుకున్న నిర్ణయం చెల్లదని గతంలోనే భద్రతా మండలి తీర్మానించిందని, దానికి అనుగుణంగా వ్యవహరించడంలో ఇజ్రాయిల్ విఫలమైందని విమర్శించింది. అక్కడ ఇజ్రాయిల్ అక్రమంగా నిర్మించిన కట్టడాలు కూడా చట్టవిరుద్దమైనవేనని తీర్మానం స్పష్టం చేసింది. భద్రతా మండలి తీర్మానాలకు అనుగుణంగా ఆక్రమిత ప్రాంతం నుండి ఇజ్రాయిల్ తన బలగాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.