రహదారి స్థలం కబ్జా!

రహదారి స్థలం కబ్జా!

రహదారి స్థలం కబ్జా!కోటిన్నరకు టెండరు పెట్టిన వైసిపి నేత

ఫిర్యాదు చేసినా చోద్యం చూస్తున్న అధికారులు

ప్రజాశక్తి -గోపాలపట్నం : రహదారికి కేటాయించిన స్థలాన్ని కబ్జా చేసి, ఫ్లాట్‌గా మార్చి అమ్మేందుకు యత్నిస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. జివిఎంసి 89 వ వార్డు సంతోష్‌ నగర్‌లో సర్వే నెంబరు 168/3లో ప్లాట్‌ నెంబరు 76, ప్లాట్‌ నెంబర్‌ 20 మధ్యలో, నాలుగు వందల గజాల స్థలం లింకేజ్‌ రోడ్డు కోసం అప్పట్లో లేఅవుట్‌లో కేటాయించారు. దీంతో ప్రస్తుతం ఆ స్థలం వినియోగంలో లేదు. దీనిపై సదరు వైసిపి నాయకుడు కన్ను పడింది. ఇక్కడ గజం స్థలం విలువ సుమారు రూ.40 వేలు ఉండగా, 400 గజాల స్థలం సుమారు రూ. కోటిన్నరపైనే ఉండడం జెసిబిని తీసుకొచ్చి చదును చేశాడు. ప్రశ్నించిన స్థానికులను, అడగడానికి వచ్చిన వారిని బెదిరింపులకు దిగాడు. స్థానికులు చేసేదేమీ లేక, ఫిర్యాదులు చేశారు. అప్పట్లో లేఅవుట్‌ వేసిన వ్యక్తులు ప్రస్తుతం అక్రమాలకు తెరదీసిన వైసిపి నాయకుడికి సమీప బంధువులు. దీంతో గతంలో ఇక్కడ రోడ్లకు మినహాయించిన స్థలాలను టార్గెట్‌ చేసి, వాటిని విక్రయించడం ద్వారా లక్షలాది రూపాయలు వెనకేసుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. సంతోషనగర్‌, కొత్తపాలెం ప్రాంతాల్లో పలు భూదందాలకు ఇదే వ్యక్తి పాల్పడుతున్నా రెవెన్యూ అధికారులు చోద్యం చూడడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. సొంతంగా చర్యలు తీసుకునే పరిస్థితి లేకపోయినా, ఫిర్యాదులు వచ్చినపుడైనా స్పందించి, అక్రమాలకు అడ్డుకుట్ట వేయాలని, రహదారి స్థలాన్ని పరిరక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

➡️