ప్రజాశక్తి – రాజమహేంద్రవరం మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి యుటిఎఫ్ పోరాట కార్యాచరణలో భాగంగా స్థానిక ఎస్కెవిటి ఉన్నత పాఠశాలలో బుధవార మున్సిపల్ ఉపాధ్యాయుల సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన పి.జయకర్ మాట్లాడుతూ మున్సిపల్ ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. మున్సిపల్ ఉపాధ్యాయులకు బదిలీలు, ప్రమోషన్స్ తక్షణం నిర్వహించాలని, మునిసిపల్ ఉన్నత పాఠశాలలలో అన్ని పోస్టులు అప్గ్రేడ్ చేయాలని, మున్సిపల్ టీచర్లకు పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు, కొత్త డిడిఒల ద్వారా దరఖాస్తు చేసుకునే సౌకర్యం కల్పించాలని, పాఠశాల అన్నింటికీ బోధనేతర సిబ్బందిని నియమించాలని, భవనాల అద్దె కరెంటు బిల్లులు చెల్లించాలని, అన్ని రకాల బకాయిలు వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాన కార్యదర్శి ఎ.షరీఫ్ మాట్లాడుతూ ప్రభుత్వం మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర సంఘం ఇచ్చిన కార్యాచరణ మేరకు దశల వారీ పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలియజేశారు. ఈ నెల 29న డిఇఒ, కలెక్టర్లకు నోటీసులు అందజేస్తామని, డిసెంబర్ 5న మున్సిపల్ కేంద్రాల్లో నిరసన ప్రదర్శన, 12, 13న అన్ని మున్సిపాలిటీరల్లో ప్రచారం, 15న జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం జిల్లాల వారీ సదస్సులు, 30న రాష్ట్రస్థాయి ధర్నా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఎన్.రవిబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నగర శాఖ అధ్యక్షులు గోపి అప్పారావు, ప్రధాన కార్యదర్శి జెవివి.సుబ్బారావు పాల్గొన్నారు.