జీలుగుమిల్లి: మండలంలో రెండు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మండల వ్యవసాయాధికారి కె.గంగాధర్ తెలిపారు. బుధవారం మండలంలోని జీలుగుమిల్లి సొసైటీలో ఒకటి, ములగలంపల్లి రైతు భరోసా కేంద్రంలో ఒక ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించాలంటే తేమ శాతం 17 ఉండేలా చూసుకోవాలని రైతులకు సూచించారు. వరి కామన్ రకం రూ.1,637 గాను ఎ రకం గ్రేడ్ రూ.1,652గా నిర్ణయించినట్లు తెలిపారు. గోనె సంచులు కూడా అందుబాటులో ఉన్నాయని, రైతులు సద్వినియోగం చేసుకోగలరని సూచించారు. పోలవరం: పోలవరం మండల కేంద్రంలో స్థానిక సచివాలయ ఆవరణలో ఉన్న రైతు భరోసా కేంద్రంలో బుధవారం ధాన్యం కొనుగోలు కార్యక్రమం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పోలవరం ఎంపిపి సుంకర వెంకటరెడ్డి, మండల వైసిపి కన్వీనర్ బుగ్గా మురళీకృష్ణ, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఫాతిమా మున్నీసా, దత్తి రాంబాబు, మండల వ్యవసాయ అధికారి కె.రాంబాబు, సొసైటీ ప్రెసిడెంట్ బలిరెడ్డి అప్పారావు పాల్గొన్నారు.