ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : తాటికాయంత ప్రచారం చేసుకుని, ఆవగింజంత సాయం చేసినట్టుగా ఉంది దళితులకు భూపంపిణీపై ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారం. ఇంకా చెప్పాలంటే ఆ ఆవగింజంత భూమి కూడా దళితులకు దక్కే పరిస్థితి ఉందని గట్టిగా చెప్పలేని పరిస్థితి. జిల్లాలోని దళితుల్లో ఎక్కువ కుటుంబాలు ఉపాధి, ఉద్యోగాలకు నోచుకోలేక తీవ్ర అస్థలు పడుతున్నారు. పూర్వం వంశపారంపర్యంగా వచ్చే గ్రామ సేవకుల పోస్టులు కూడా మారిన ప్రభుత్వ విధానాలతో అందకుండా పోయాయి. మరోవైపు చాలా కాలంగా దళితులకు అసైన్డ్ భూములు ఇవ్వడం లేదు. దీంతో, దళితులు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబాటుకు గురికావాల్సివస్తోంది. ఫలితంగా కులవివక్ష, రాజకీయ వేధింపులు చవిచూడాల్సిన దుస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో దళితులకు విరివిరిగా అసైన్డ్ భూములు ఇచ్చి ఆర్థికంగా ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇప్పటికే సాగులోవున్న భూములకు పట్టాలిచ్చి చేతులు దులుపుకునేందుకు, ఎన్నికల వేళ గట్టి ప్రచారం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. భూమిలేని పేద దళిత కుటుంబాలు సాగు ద్వారా జీవనం పొందేందుకు ప్రభుత్వ భూమి ఇవ్వాల్సివుంది. ఇది చాలా కాలంగా అమలు కావడం లేదు. దీంతో, నాటి టిడిపి, నేటి వైసిపిలపై దళితుల్లో వ్యతిరేకత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వీరికి అసైన్డ్ ల్యాండ్ ఇవ్వాల్సిన ప్రభుత్వం ఇప్పటికే సాగులోవున్న అసైన్డ్ భూములకు సాగుపట్టాలు ఇవ్వడం, అసైన్డ్ భూమి పొంది 30ఏళ్లు దాటినవాటిని రెగ్యులర్ చేయడం, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గతంలో ఇచ్చిన భూములపై మార్టుగేజ్ ఎత్తివేత వంటి చర్యలతో సరిపెడుతోంది. దీనివల్ల దళితులకు అదనంగా ఒరిగేదేమీ లేదు సరికదా ఇప్పటికే చేతులు మారిన అసైన్డ్ ల్యాండ్ పెత్తందారులు, రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం కనిపిస్తోంది. 2003 నాటికి ముందు విజయనగరం జిల్లా వ్యాప్తంగా సుమారు 30వేల ఎకరాల సాగు భూములు దళితులకు ఇచ్చినట్టుగా అధికార యంత్రాంగం గుర్తించింది. ఇందులో ప్రస్తుతం సంబంధిత రైతుల సాగుతోపాటు వెబ్ ల్యాండ్లోనూ సంబంధిత వివరాలు ఉన్నవి 6,300 ఎకరాలు మాత్రమేనట. దీన్నిబట్టి మిగిలిన భూమంతా చేతులు మారిందని, దళితుల బలహీనత, ఆర్థిక అవసరాలను ఆధారంగా చేసుకుని చట్టానికి విరుద్ధంగా పెత్తందారులు, కాస్త ఆర్థికంగా, రాజకీయంగా అవకాశం ఉన్నవారు వశపర్చుకున్నారని అర్థమౌతోంది. మరోవైపు ఇలా గుర్తించిన 6,300 ఎకరాలు కూడా వాస్తవంగా దళితుల చేతుల్లోనే ఉన్నాయా? లేక రాజకీయ పలుకుబడితో దళితుల చేతుల్లోకి వచ్చాక వశపర్చుకునేందుకు ఎవరైనా ప్రయత్నిస్తున్నారా? అన్నది తేలాల్సివుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో కొత్తగా 1336 మందికి డి-పట్టాలు ఇచ్చేందుకు అధికార యంత్రాంగం గుర్తించింది. కానీ, ఇవేవీ కొత్తగా ఇస్తున్నవి మాత్రం కాదు. చాలా ఏళ్లగా దళితుల సాగులోవున్న భూములను గుర్తించి, వాటినే కొత్తగా రైతులకు పంపిణీ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. ఈ విధంగా రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ నియోజకవర్గం చీపురుపల్లిలో ఎక్కువ మంది లబ్ధిదారులు ఉన్నాయి. ఎస్సి కార్పొరేషన్ ద్వారా 216 మందికి గతంలో ఇచ్చిన భూములను కూడా రెగ్యులర్ చేయనున్నారు. వాటిపైవున్న స్మార్ట్ గేజ్ తొలగించేందుకు నిర్ణయం చేసినట్టు అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి చాలా మండలాల్లో ఇప్పటికే భూమి చేతులు మారింది. వీటిని దళితులకు ఏ విధంగా అప్పగిస్తారో? తీరా అప్పగించాక దళితులపై ఎలాంటి ఒత్తిళ్తు మొదలవుతాయో వేచి చూడాల్సిందే. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ మూడు పద్ధతుల్లోనూ డిసెంబర్ మూడులోపు పట్టాలు ఇచ్చేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. అందుకనుగుణంగా ఇప్పటికే ఆయా భూములకు సంబంధించి 22ఎ ను, మార్ట్గేజ్లను ఎత్తివేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఇంకా అవసరమైన చోట భూమిని కూడా సేకరిస్తామని చెబుతున్నారు