‘స్పందన’లో ప్రజా సమస్యలకు పరిష్కారం

స్పందనలో అర్జీలు స్వీకరిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌

ప్రజాశక్తి-అమలాపురం

స్పందన -జగనన్నకు చెబుదాం కు వచ్చిన అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా అధికారులను జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నుపూర్‌ అజరు ఆదేశించారు.బుధవారం స్థానిక అల్లవరం మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి కార్యాలయంలో మండల స్థాయి జగనన్నకు చెబుదాం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నుపూర్‌ అజరు.. అమలాపురం ఆర్‌డిఒ జి.కేశవ వర్ధన్‌ రెడ్డితో కలిసి అర్జీదారుల నుంచి 86 అర్జీలను స్వీకరించారు.ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ… ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రతి సోమవారం జిల్లాస్థాయి స్పందన జగనన్నకు చెబుతాం కార్యక్రమాలతో పాటు మండల స్థాయిలో వారానికి రెండు రోజులు (బుధవారం, శుక్రవారం) జగనన్నకు చెబుదాం నిర్వహించాలని ఆదేశించిందన్నారు. దీనిని బట్టి ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఎంత ప్రాధాన్యత నిస్తుందో అధికారులు గుర్తించి క్షేత్రస్థాయిలో వచ్చిన ఫిర్యాదులను సకాలంలో నాణ్యతతో పరిష్కరించాలని, ఏ రోజు వచ్చిన అర్జీలను ఆ రోజే ఓపెన్‌ చేసి నిశీతంగా పరిశీలించి సమస్యలను పరిష్కరించాలన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమాని కోసం ప్రత్యేకంగా ఒక టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1902 ఏర్పాటు చేశారని, సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలు అందడంలో ఇబ్బందులు తలెత్తితే అర్జీదారులు టోల్‌ ఫ్రీ నెంబర్‌ కు కాల్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చని, ఈ ఫిర్యాదులను రాష్ట్ర స్థాయి టీములు సమస్యలు పరిష్కారమయ్యేదాకా ట్రాకింగ్‌ చేస్తుంటాయని, అధికారులు ఈ విషయాన్ని గమనించి సకాలంలో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఎ పీడీ వి.శివశంకర్‌ ప్రసాద్‌, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ సాధికారత అధికారి జివి.సత్యవాణి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ ఎస్‌.మధుసూదన్‌, గ్రామ వార్డు సచివాలయ నోడల్‌ అధికారి కె.భీమేశ్వర్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎం.దుర్గా రావు దొర, డిసి హెచ్‌ఎస్‌ పద్మశ్రీరాణి, డిపిఒ వి.కృష్ణకుమారి, సిపిఒ వెంకటేశ్వర్లు, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️