విద్యార్థులకు బాల్య వివాహాలపై అవగాహన సదస్సు

Nov 29,2023 16:04 #Annamayya district
awareness on child marriages

ప్రజాశక్తి-పుల్లంపేట : మండల పరిధిలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం యందు బుధవారం నాడు పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిలకు పాఠశాల ప్రిన్సిపల్ కేజీ రూత్ మేరీ మరియు అంగన్వాడీ సిబ్బంది ఆధ్వర్యంలో బాల్యవివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించడమైనది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ రూత్ మేరీ మరియు మండల తహసిల్దార్ నరసింహా కుమార్ మాట్లాడుతూ బాల్యవివాహాలను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, బాల్య వివాహాలు అరికట్టడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని తెలియజేశారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. బాల్య వివాహాల నిర్మూలనకు టోల్ ఫ్రీ నెంబర్ 1098 కు ఫోన్ చేసి బాల్య వివాహాలు నిర్మూలించాలని తెలిపారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినప్పటికీ ఇంకా బాలవివాహాలు జరగడం చాలా బాధాకరమని బాల్యవివాహాల వల్ల అమ్మాయి, అబ్బాయి జీవితాలు నాశనం అవుతున్నాయని, సచివాలయాల పరిధిలోని మహిళా పోలీసులు, పంచాయతీ సెక్రటరీలు, ఏఎన్ఎంలు, ఐసిడిఎస్ సిబ్బంది బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాల గురించి తల్లిదండ్రులకు పూర్తి అవగాహన కల్పించాలని తెలిపారు. 18 సంవత్సరాల లోపు బాలికలకు, 21 సంవత్సరాల లోపు అబ్బాయిలకి వివాహం చేస్తే పెళ్లి కుమారునికి వారి తల్లిదండ్రులకు పెళ్లిలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసింది. మైనర్ బాలికను వివాహం చేసుకొని తనతో సంసారం చేసిన భర్తకు ఫోక్స్ చట్టం కింద పది సంవత్సరాలు జైలు శిక్ష కూడా విధించడం జరుగుతుందని తెలిపారు. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు చదువుకునే వయసులోనే వివాహం చేసి చిన్నారుల జీవితాలతో ఆడుకుంటున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాల్యవివాహాలను అడ్డుకట్ట వేసేందుకు అనేక కార్యక్రమాలను చేపడుతుందని ఎక్కడైనా బాల్యవివాహాలు జరుగుతున్నట్లు ఎవరి దృష్టికి వచ్చిన హెల్ప్ లైన్ నెంబర్ ల ద్వారా వెంటనే సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేయాలని తెలిపారు. బాల్య వివాహం నేరం – చట్టం ప్రకారం శిక్షార్హులు, బాల్య వివాహం చేసిన.. చేసుకున్న.. ప్రోత్సహించిన రెండేళ్ల జైలు లక్ష రూపాయల జరిమానా అనే నినాదాలతో తల్లిదండ్రుల్లో విద్యార్థుల్లో అవగాహన కల్పించాలని తెలియజేశారు. బాల్యవివాహాలు చట్టవిరుదమని ఐసిడిఎస్ సిబ్బంది తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఈఓ 1 చక్రధర్ రాజు, ఎంఈఓ 2 నాగ తిరుమలరావు, ఐసిడిఎస్ సూపర్వైజర్లు మణెమ్మ, ఎం.జయలక్ష్మి, వై.నిర్మలాదేవి మరియు అంగన్వాడి టీచర్స్, మహిళా పోలీసు తదితరులు పాల్గొనడం జరిగింది.

➡️