పని ప్రదేశాల్లో పెరుగుతున్న మరణాలు !

 

  • భద్రతా చట్టాన్ని బలోపేతం చేయాలని దేశాలను కోరిన ఐఎల్‌ఓ

న్యూఢిల్లీ : పని ప్రదేశాల్లో సంభవించే ప్రమాదాలు, తలెత్తే వ్యాధుల కారణంగా ప్రతి ఏటా అంతర్జాతీయంగా దాదాపు 30లక్షల మంది కార్మికులు చనిపోతున్నారని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) రూపొందించిన కొత్త నివేదిక పేర్కొంది. వీటిలో 63శాతానికి పైగా మరణాలు ఆసియా-పసిఫిక్‌ ప్రాంతం నుండే సంభవిస్తున్నాయని తెలిపింది. సుదీర్ఘమైన (వారానికి 55గంటలకు పైగా) పనిగంటలు వుండడం అన్నింటికంటే పెద్ద మరణ కారణంగా వుంది. 2016లో ఈ కారణంగానే దాదాపు 7.45 లక్షల మంది చనిపోయారు. పనిచేసే ప్రదేశాల్లో తలెత్తే కలుషిత వాయువులు, పొగలు, ఇతర విష పదార్ధాల వల్ల ఏడాదికి 4.5లక్షల మంది చనిపోతున్నారు. ఇది రెండో కారణంగా వుంది. ఇక మూడో కారణంగా, పనిచేసే సమయంలో సంభవించే గాయాలతో 3.63లక్షల మంది మరణిస్తున్నారు. ‘ఎ కాల్‌ ఫర్‌ సేఫర్‌ అండ్‌ హెల్తీయర్‌ వర్కింగ్‌ ఎన్విరాన్‌మెంట్స్‌’ శీర్షికతో వెలువడిన నివేదికను ‘భద్రత, పని ప్రదేశంలో ఆరోగ్యం’పై జరుగుతున్న 23వ ప్రపంచ మహాసభలో చర్చించనున్నారు. ఈ అంశంపై జరిగే అతిపెద్ద అంతర్జాతీయ మహాసభల్లో ఇదొకటి. సిడ్నీలో సోమవారం ఈ సభ ప్రారంభమైంది. ప్రమాదకరమైన వృత్తుల్లో గాయాల రేటుపై గల డేటాను ఆ నివేదిక ఉటంకించింది. అంతర్జాతీయంగా మూడు రంగాలు అత్యంత ప్రమాదకరమైనవిగా వున్నాయని, అవి మైనింగ్‌ మరియు క్వారీయింగ్‌, నిర్మాణ రంగం, ఇతర సదుపాయాల కల్పనా రంగాలని నివేదిక పేర్కొంది. భారత్‌ తరపున ఇఎస్‌ఐసి డైరెక్టర్‌ జనరల్‌ రాజేంద్ర కుమార్‌ పాల్గొన్నారు. మొత్తంగా 187 దేశాల్లో 79 దేశాలు ఇప్పటివరకు ఐఎల్‌ఓ వృత్తిపరమైన భద్రతా, ఆరోగ్య ఒప్పందాన్ని దృవీకరించాయని ఆ నివేదిక పేర్కొంది. మరో 62దేశాలు వృత్తిపరమైన భద్రత, ఆరోగ్య ఒప్పందానికి చట్రపరిధిని రూపొందించే ఒప్పందాన్ని ధృవీకరించాయి. భారత్‌ ఈ రెండు ఒప్పందాలనూ ధృవీకరించలేదు. ఉత్తరకాశీ సొరంగం ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఈ రెండు ఒప్పందాలను ఆమోదించి, ధృవీకరించాల్సిందిగా సిఐటియు కోరింది. పైన పేర్కొన్న రెండు ఒప్పందాల కీలక సూత్రాలకు అనుగుణంగా, జాతీయస్థాయిలో వృత్తిపరమైన ప్రదేశాల్లో సమర్ధవంతమైన భద్రతా వ్యవస్థ వుండాలని నివేదిక దేశాలను కోరింది. సురక్షితమైన, భద్రతతో కూడిన ఆరోగ్యకరమైన పని వాతావరణం కల్పించడం ప్రాథమిక హక్కని ఆ నివేదిక స్పష్టం చేసింది. పని సంబంధిత మరణాల్లో మెజారిటీ భాగం అంటే 26లక్షల వరకు పని సంబంధిత వ్యాధుల కారణంగా చనిపోతున్నారు, మరో 3.3 లక్షల మంది పని ప్రదేశాల్లో ప్రమాదాల కారణంగా చనిపోతున్నారు. 2000, 2020 మధ్య కాలంలో చర్మ సంబంధిత కేన్సర్‌ వ్యాధి 37శాతం పెరిగిందని పేర్కొంది. పనిచేసే సమయాల్లో క్రోమియం తాకిడి రెట్టింపు అయిన కారణంగా 2000-2016 మధ్య కాలంలో ఊపిరితిత్తుల కేన్సర్లు బాగా పెరిగాయని పేర్కొంది. కాలుష్య కారక వాయువులు పీల్చడం వల్ల 20శాతం వరకు మరణాలు సంభవించాయని తెలిపింది. ఈ పరిస్థితులను నివారించేందుకు గానూ సురక్షితమైన, ఆరోగ్యకరమైన పని వాతావరణం కల్పించాల్సిన తక్షణ ఆవశ్యకత వుందని ఐఎల్‌ఎ నివేదిక స్పష్టం చేసింది. సమిష్టి బేరసారాల హక్కును కూడా గుర్తించాలని, అనేక రూపాల్లో అమలవుతున్న నిర్బంధంగా లేదా బలవంతంగా పని చేయించుకోవడాన్ని నిర్మూలించాలని నివేదిక కోరింది.

➡️