ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి : వ్యవసాయంలో అత్యధిక శాతం ఉన్న కౌలు రైతుల పరిస్థితి రోజు రోజుకూ దయనీయంగా మారుతోంది. సాగు కోసం రుణాలు అందడం లేదు. పెట్టుబడి సాయమూ అంతంత మాత్రంగానే అందుతోంది. వర్షాభావం వల్ల పంటలు పండక అప్పులు తీర్చలేక కౌలు రైతులు నష్టాల పాలవుతున్నారు.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 70వేల మందికి పైగా కౌలు రైతులు ఉన్నారు. వారిలో కర్నూలు జిల్లాలో 18,496 మందికి, నంద్యాల జిల్లాలో 22,540 మందికి మొత్తంగా 41,096 మందికి కౌలు రైతు రుణ అర్హత కార్డులను పంపిణీ చేశారు. కౌలు రైతులు ఎకరాకు రూ.వేలు కౌలు చెల్లించి, లక్షల పెట్టుబడి పెట్టి పంటలను సాగు చేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో వర్షాభావం వల్ల పంటలు పండక కౌలు రైతులు అప్పుల పాలయ్యారు. రబీలోనూ వర్షాభావ పరిస్థితులే నెలకొనడంతో పంటల మీద ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వ్యవసాయ శాఖ కౌలు రైతులను గుర్తిస్తుంది. రెవెన్యూ శాఖ సిసిఆర్సి కార్డులను జారీ చేస్తుంది. ఈ రెండు శాఖల సమన్వయంతో సిసిఆర్సి కార్డులున్న కౌలు రైతులకు పంట రుణాలు ఇప్పించేలా బ్యాంకర్లను ఒప్పించాల్సి ఉంటుంది. ఆయా శాఖలు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో కౌలు రైతులకు పంట రుణాలు అందడం లేదు. కర్నూలు జిల్లా పరిధిలో రూ.127 కోట్లు, నంద్యాల జిల్లాలో రూ.97 కోట్లు వ్యవసాయ రుణాలు ఇప్పించాలని వ్యవసాయ శాఖ లక్ష్యం నిర్దేశించింది. ఖరీఫ్ కాలం ముగిసి పోయింది. రబీ సీజన్ ప్రారంభమై నెలలు గడుస్తున్నా పంట రుణాలు అందక కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేవలం 437 మందికి రూ.2.55 కోట్ల రుణాలు మాత్రం ఇచ్చారు. ప్రభుత్వం నుంచి రూ.4వేల పెట్టుబడి సాయం అందుతుంది అనుకున్న కౌలు రైతుల్లో చాలా మందికి నిరాశే దక్కింది. పెట్టుబడి సాయం చాలా తక్కువ మందికి అందింది. కర్నూలు జిల్లాలో కౌలు రైతు కార్డులు ఉన్న 18,496 మందిలో 7,306 మందికే పెట్టుబడి సాయం అందింది. నంద్యాల జిల్లాలో కౌలు రైతు కార్డులు ఉన్న 22,540 మందిలో 10,004 మందికే పెట్టుబడి సాయం అందింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 17,310 మందికి పెట్టుబడి సాయం అందగా 23,726 మంది కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందలేదు. సిసిఆర్సి కార్డులకూ మెలికకౌలు రైతు రుణ అర్హత గుర్తింపు కార్డు (సిసిఆర్సి) కార్డు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘2019 పంట సాగుదారు హక్కుచట్టం’ తెచ్చి మెలిక పెట్టి ప్రభుత్వ సాయం ఏ ఒక్కటీ అందకుండా చేసింది. ఈ చట్టంలో భూయజమాని అంగీకారం లేకుండా కౌలు రైతులకు సిసిఆర్సి(కౌలుకార్డు) ఇవ్వకూడదని తెలిపింది. సిసిఆర్సి కార్డు లేకుంటే బ్యాంకు రుణం నుంచి బీమా, ఇన్‌ఫుట్ సబ్సిడీ, రైతు భరోసాతో పాటు చివరికి ధాన్యం అమ్ముకునే పరిస్థితి కూడా కౌలు రైతులకు లేకుండాపోయింది.