ప్రజాశక్తి-అమరావతి : కోర్టు ధిక్కరణ కేసులో ఇద్దరు ఐఎఎస్ అధికారులకు హైకోర్టు జైలుశిక్ష విధించింది. డిసెంబరు 8లోగా హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) వద్ద లొంగిపోవాలని ఆదేశించింది. ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, కళాశాల విద్యా కమిషనర్ పోలా భాస్కర్‌కు నెల రోజుల చొప్పున సాధారణ జైలుశిక్ష, రూ.1000 చొప్పున జరిమానాలను విధించింది. శిక్ష అమలు నిమిత్తం రిజిస్ట్రార్ వద్ద వారంలోగా లొంగిపోవాలంది. లొంగిపోయిన తర్వాత చట్ట నిబంధనలకు అనుగుణంగా జైలుకు తరలింపునకు తగిన చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అన్ఎయిడెడ్ లెక్చరర్లను ఎయిడెడ్ కాలేజీల్లోకి తీసుకోవాలని గతేడాది జులైలో హైకోర్టు తీర్పు చెప్పింది. దీనిని అమలు చేయలేదంటూ సూరిబాబు ఇతర పిటిషనర్లు కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలను దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ మన్మధరావు మంగళవారం ఇద్దరు ఉన్నతాధికారులకు జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.