రోజుల తరబడి ఆరబోత

Nov 28,2023 23:30
పిఠాపురం రోడ్డులో

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి

పిఠాపురం మండ లం చిత్రాడ గ్రామానికి చెందిన ఆదిరెడ్డి సన్యాసిరావు మూడు ఎకరాలు కౌలుకు సాగు చేస్తు న్నాడు. వాతావరణ పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియక యంత్రం ద్వారా కోత కోసి నాలుగు రోజులుగా ధాన్యాన్ని రోడ్డుపై ఆరబెడు తున్నాడు. ఇద్దరి కూలీలకు రోజుకి రూ.1600 ఖర్చు అవుతుంది. 17 శాతం లోపు తేమ రావా లంటే ఇంకోరోజు ఆరబెట్టాలని ఆర్‌బికె సిబ్బంది తెలిపారని చెబుతున్నాడు. తేమ శాతం నిబంధన వలన ఎకరాకు రూ.2 వేలు అదనపు ఖర్చు అవుతుందని ఆయన తెలిపారు.ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు ధాన్యాన్ని అమ్మాలంటే అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రధానంగా తేమశాతం నిబంధన పక్కాగా అమలు చేస్తుండడంతో రోజుల తరబడి ధాన్యాన్ని ఆరబోసేందుకు అనేక అవస్థలు పడుతున్నారు. తేమ శాతం తగ్గించడానికి అదనపు ఖర్చు చేయాల్సి వస్తుందని వాపోతున్నారు. కాకినాడ జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌ లో 2.40 లక్షల ఎకరాల్లో రైతులు వరిని సాగు చేయగా 266 ఆర్‌బికెల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 80 వేల ఎకరాల్లో కోతలు పూర్తయ్యాయి. కేంద్రాలు ఏర్పాటు చేసి నెల రోజులు కావస్తున్నా సుమారు 18 వేల మెట్రిక్‌ టన్నుల దాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయగలిగారు. ముఖ్యంగా తేమ శాతం నిబంధన వలన రైతులు నాలుగు నుంచి వారం రోజుల పాటు ధాన్యాన్ని ఆరబెట్టాల్సి వస్తుంది. అదనపు భారం ఆది నుంచి ధాన్యం రైతులకు కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధరకు ధాన్యాన్ని సేకరిస్తామని చెప్పినప్పటికీ అనేక కొర్రీలు పెడుతుంది. దీంతో తేమశాతం తగ్గించడానికి రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. ధాన్యాన్ని ఎండలో ఆరబెట్టేందుకు అదనపు భారాన్ని భరిస్తున్నారు. ఎకరాకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ఆరబెట్టేందుకు అదనపు కూలి ఖర్చులు అవుతున్నాయని పలువురు రైతులు చెబుతున్నారు. ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెరిగిపోగా ప్రభుత్వం ఇస్తున్న గిట్టుబాటు ధర ఏమాత్రం సరిపోవటం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. అన్ని పరిస్థితులు అనుకూలిస్తే పెట్టిన పెట్టుబడి సొమ్ములు మాత్రమే వస్తున్నాయి. రైతు ఎంత కష్టపడినా తగిన ఫలితం ఉండడం లేదు. ఈ నేపథ్యంలో కొనుగోలుకు నిబంధనలు విధించడంతో అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తేమ పేరుతో ఆలస్యం చేయకుండా వెంటనే కొనుగోలు చేస్తే కొంత మేలు చేసినట్లు అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

➡️