ప్రజాశక్తి – చింతకొమ్మదిన్నె గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీ ఉద్యాన సలహా మండలి చైర్మన్ సంబటూరు ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరులో చిరుధాన్యాల విలువ జోడింపుపై నైపుణ్య శిక్షణ కార్యక్రమం ముగింపు కార్యక్రమ నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చిరుధాన్యాల సాగు వల్ల ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఏరువాక కేంద్రం, ఆత్మ కడప వారు సంయుక్తంగా వారం రోజుల పాటు యువ రైతులకు చిరుధానాల విలువల జోడింపు పై శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు. శిక్షణలో చిరుధాన్య పంటల ఆవశ్యకత, చిరుధాన్యాలు ఉత్పత్తిలో ఉండే పోషకాలు విలువలు, చిరుధాన్యాల సాగుకు అనుకూలమైన నేలలు, వాతావరణ పరిస్థితులు యాజమాన్య పద్ధతులు వివరించడంతోపాటు పలు విజ్ఞాన యాత్రలు క్షేత్రస్థాయిలో చూపించి, వాటికి అవసరమయ్యే యంత్ర పరికరాలు వాటి తయారీకి అయ్యే ఖర్చు వివరాలు తెలియజేశారన్నారు. అనంతరం ఏరువాక కేంద్రం, కెవికె శాస్త్రవేత్తలు డాక్టర్ మురళీకష్ణ, డాక్టర్ వీరయ్య చిరుధాన్యాలపై యువ రైతులకు వివరించారు, శిక్షణ కార్యక్రమానికి కో- ఆర్డినేటర్ గా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రామలక్ష్మి దేవి వ్యవహరించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు ఆత్మ డిపిడి పద్మలత, కెవికె శాస్త్రవేత్తలు శిల్పకళా,సాయి మహేశ్వరి, మహేష్ బాబు, మానస ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.