పెద్దలకే అసైన్డ్‌

జిల్లాలో అసైన్డ్‌ భూములను పెద్దల పరం చేయ డానికి రంగం సిద్ధమైంది. ప్రభుత్వం క్రమబద్ధీకరణ పేరుతో గైడ్‌లైన్స్‌ రూపకల్పన చేసింది. తాజాగా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. పేదల ముసుగులో ప్రజాప్రతినిధుల అను యాయులు, బడాబాబులకు కట్టబెట్టనుంది. అసైన్డ్‌ భూములు సహజంగా పెద్దల ఆక్రమణల్లో ఉండడం కద్దు. ఇటువంటి పరిస్థి తులను ఆసరా చేసుకుని పెద్దల అనుభవంలో ఉన్న భూములను అసైన్డ్‌మెంట్‌ కమిటీ పేరుతో పేదలకు పంపిణీ చేయాల్సింది పోయి, 2.5 రెట్లు చెల్లింపుల పేరుతో అనుభవజ్ఞులకు ధారాదత్తం చేయడం విస్మయాన్ని కలిగిస్తోంది.ప్రజాశక్తి – కడప ప్రతినిధి కడప జిల్లాలో 1,54,314 లక్షల ఎకరాలు అసైన్డ్‌ భూములు ఉన్నాయి. 30,059 ఎకరాల పంపిణీ నిమిత్తం జిల్లా అధికార యంత్రాంగం గుర్తించింది. కడప అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ కింద 401 లేఅవుట్లు, జిల్లా పంచాయతీ కార్యాలయం పరిధిలో 250 లేఅవుట్లు అక్రమంగా ఉన్నాయి. వీటిలో నాలుగో వంతు అసైన్డ్‌ భూములు కావడం వల్లే ల్యాండ్‌ కన్‌వర్షన్‌ కావడం లేదని తెలుస్తోంది. అసైన్డ్‌ భూముల పంపిణీ చేయడానికి అనుగుణంగా జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఏడు వేల ఎకరాల అసైన్డ్‌ భూములు నిజమైన అర్హుల చేతిలో ఉన్నట్లు అంచనా. మిగిలిన భూములన్నీ అనర్హులకే పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి. మూడు నెలల కిందట పులివెందుల మండల జాబితాలో కొంతమంది అనర్హుల పేర్లు వెల్లడి కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అసైన్డ్‌ భూముల వివరాలు, జాబితాలు బయటికి పొక్కనీయకుండా సకల జాగ్రత్తలు తీసుకుంది. అనర్హుల పేర్లు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట, పెండ్లి మర్రి, చాపాడు తదితర మండలాల జాబితాలో అనర్హుల పేర్లు ఉండడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. అసైన్డ్‌ పందేరానికి తటపటాయించింది. అసైన్డ్‌మెంట్‌ భూముల పంపిణీ జాబితాలో అనర్హుల పేర్లు ఉన్నట్లు వెల్లడైన నేపథ్యంలో ఓ ఐదు మండలాల్లో రీసర్వే పేరుతో గోప్యంగా కథ నడిపిస్తోంది. ప్రభుత్వం 2024 సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో క్రమబద్ధీకరణ పేరుతో ప్రజాప్రతినిధుల అను యాయులు, అనుచరులు, బడా బాబుల అను భవంలో ఉన్న భూములను కైవసం చేసుకునేందుకు కసరత్తు చేసింది. ఇటువంటి భూములకు మార్కెట్‌ రేటు కంటే 2.5 రెట్లు చెల్లింపులు చేస్తే యాజ మాన్య హక్కులను దఖలు పరుస్తామని, బిపిఎల్‌ పరిధిలో ఉన్న వ్యక్తుల ఆధీనంలోని అసైన్డ్‌ భూములకు మార్కెట్‌ రేటు ప్రకారం చెల్లింపులు చేస్తే సరిపోతుందని జిఒను తెచ్చింది. భూములు లేని పేదలకు మిగులు, అసైన్డ్‌ భూములు పంపిణీ చేయాలనే ఆశయాన్ని ఉద్దేశ పూరితంగా పక్కదారి పట్టిస్తుండడం పట్ల పేదల్లో తీవ్ర ఆవేదనను మిగుల్చుతోంది. అనుభవం, ఆక్రమణల్లోని అసైన్డ్‌ భూములను సంబంధిత వ్యక్తులకు అసైన్డ్‌ భూము లను కట్టబెట్టడం భూములు లేని పేదలకు భూముల పంపిణీ చేయడమనే ఆశయం నుంచి పక్కకు తప్పుకో వడమే అవుతుందనడంలో సందేహం లేదు.పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలి అసైన్డ్‌ భూముల గుర్తింపులో గోప్యత ఎందుకో తెలియడం లేదు. పారదర్శకంగా గుర్తింపు ప్రక్రియ చేపట్టినట్లయితే గోప్యత ఎందుకు. అసైన్డ్‌ భూముల వివరాలను, జాబితాలను ఎందుకు బయట పెట్టరు. ఇలా చేయడం వల్ల గోప్యత ముసుగులో లొసుగులు ఉన్నట్లు అనుమానించాల్సి వస్తోంది. జిల్లా అధికార యంత్రాంగం అసైన్డ్‌ భూముల పంపిణీ ప్రక్రియలో పారదర్శకతకు పెద్దపీట వేయాలి.- వి.అన్వేష్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి. కడప.

➡️