తెలంగాణాలో కాంగ్రెస్‌నే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది : అశోక్‌ గెహ్లాట్‌

Nov 28,2023 16:32 #Ashok Gehlot, #Telangana

హైదరాబాద్‌ : తెలంగాణాలో కాంగ్రెస్‌నే గెలుస్తుంది. ఆ పార్టీనే ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో గెహ్లాట్‌ మాట్లాడుతూ.. ‘ఐదు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌నే అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలే దానికి కారణం. రాజస్థాన్‌లో కంటే.. తెలంగాణాలో ఇచ్చిన హామీలు ప్రజల్ని ఆకట్టుకునేలా ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చడం అన్నది కాంగ్రెస్‌ పార్టీతోపాటు, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేల మంత్రం. ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత హిమాచల్‌ ప్రదేశ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ వంటి వివిధ రాష్ట్రాల్లో జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత తెలంగాణాకు మరిన్ని హామీలు చేర్చబడతాయి.’ అని గెహ్లాట్‌ అన్నారు. అలాగే తెలంగాణలో సుపరిపాలన లేదు. తెలంగాణాలో కాంగ్రెస్‌ అధికారంలో ఉండి ఉంటే ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి చెంది ఉండేది. బిజెపి, బిఆర్‌ఎస్‌ పార్టీలూ రెండూ ఒక్కటే.. ఈ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. గత తొమ్మిదేళ్లలో దేశంలో ఎక్కడ చూసినా పేపర్‌ లీకేజీలు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్‌, తెలంగాణ, గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లోనూ పేపర్‌ లీకేజీలు జరుగుతున్నా.. దేశంలో పేపర్‌ లీకేజీలపై కఠిన చట్టాలు చేసిన ఏకైక రాష్ట్రం రాజస్థాన్‌. జీవిత ఖైదు నిబంధనతో చట్టాన్ని ఆమోదించాం. పేపర్‌ లీక్‌ కేసులపై చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వాలను పడగొట్టేందుకు బిజెపి గుర్రపు వ్యాపారం చేస్తోంది. ఈ వ్యాపారం ద్వారానే మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాలను కూల్చివేసింది.’ అని ఆయన అన్నారు. కాగా, నవంబర్‌ 30వ తేదీ తెలంగాణాలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల ఫలితాలు డిసెంబర్‌ 3వ తేదీన వెలువడనున్నాయి.

➡️