ప్రజాశక్తి-విశాఖ : ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సమీపంలోని మలక్కా జలసంధి ప్రాంతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ.. బుధవారం నాటికి ఆగేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. మరో 48 గంటల్లో తుపానుగా బలపడే అవకాశముందని చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో దిగువ ట్రోపో ఆవరణలో తూర్పు గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చన్నారు. నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మంగళవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలకు అవకాశముందని తెలిపారు.