ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు పొలాలను ఖాళీగా ఉంచకుండా ప్రత్యామ్నాయ, తక్కువ కాలపరిమితిగల పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాలని అధికా రులను పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ ఆదేశించారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి మరియు నీటిపారుదల సలహా మండలి సమావేశం నరసరావుపేటలోని కలెక్టరేట్‌లోని స్పందన సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు. సమావేశానికి జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కుర్రి సాయిమార్కొండారెడ్డి అధ్యక్షత వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవసరమైన విత్తనాలను రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని, ఉపాధి హామీ చట్టం కింద పొలాల్లో నీటి గుంతలు తీయించాలని చెప్పారు. జాయింట్ కలెక్టర్ ఎ.శ్యాం ప్రసాద్ మాట్లాడుతూ కంది పంటపై సస్యరక్షణ యాజమాన్య చర్యలు చేపట్టి రైతులు అధిక దిగుబడులు సాధించేలా వ్యవసాయ శాఖ అధికారులు సలహాలు సూచనలు ఇవ్వాలన్నారు. కంది పంటను కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామన్నారు. సాయి మార్కొండారెడ్డి మాట్లాడుతూ రబీలో పశుగ్రాసం పెంపకంపైనా రైతులు దృష్టి సారించాలన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎస్‌ఇ వరలక్ష్మీ మాట్లాడుతూ నాగార్జున సాగర్‌లో నీరు తక్కువగా ఉన్న దృష్ట్యా తాగు అవసరాలకు మాత్రమే నీటిని విడుదల చేస్తామని, రైతులకు తమకు సహకరించాలని కోరారు. జిల్లా వ్యవసాయ శాఖాధికారి మురళి మాట్లాడుతూ రబీలో సాగు చేసే వరి, మొక్కజొన్న పంటలకు ప్రత్యామ్నాయంగా శనగ, మినుము, పెసర, నువ్వుల పంట వేసుకొనే విధంగా రైతులను ప్రోత్సహిస్తున్నా మని, విత్తనాలనూ అందుబాటులో ఉంచుతు న్నామని తెలిపారు. అనంతరం ‘రైతుకు వందనం’ కార్యక్రమం ద్వారా అధిక నికర ఆదాయం పొందుతున్న రైతులను సత్కరించారు.