ఆడుదాం ఆంధ్ర రిజిస్ట్రేషన్‌ ప్రారంభం

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ‘ఆడుదాం ఆంధ్ర’ ఆటల పోటీలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పల్నాడు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, ఆడుదాం ఆంధ్ర జిల్లా నోడల్‌ అధికారి ఎ.శ్యాంప్రసాద్‌ అన్నారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని పాలపాడు రోడ్డులో ఉన్న ప్రశాంతి నగర్‌ సచివాలయం-2లో ఆడుదాం ఆంధ్ర ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను జెసి సోమవారం పరిశీలించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి గ్రామ స్థాయిలోని సచివాలయాలలో సోమవారం నుండి రిజిస్ట్రేషన్‌ మొదలైందని చెప్పారు. ఆటల పోటీలకు సంబంధించి కిట్లు అందాయా? లేదా? అని సచివాలయ సిబ్బందిని వివరాలు అడిగారు. రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చిన క్రీడాకారులతో మాట్లాడి ఏయే పోటీల్లో పాల్గొంటున్నారో వివరాలు తెలుసుకున్నారు. వచ్చేనెల 13వ తేదీ వరకూ రిజిస్ట్రేషన్‌ ఉంటుందని, ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్టెప్‌ సిఇఒ పల్లవి, మున్సిపల్‌ కమిషనర్‌ రామ్మోహన్‌, క్రీడల హెడ్‌ కోచ్‌, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

➡️