యువగళం ప్రారంభం

Nov 27,2023 23:03
తాటిపాక సెంటర్‌లో

పొదలాడ నుంచి లోకేష్‌ యాత్ర

భారీగా తరలి వచ్చిన టిడిపి శ్రేణులు

ప్రజాశక్తి- రాజోలు, మామిడికుదురు, అమలాపురం

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్ర మళ్లీ ప్రారంభమైంది. చంద్రబాబు అరెస్ట్‌ అనంతరం నిలిచిన పాదయాత్ర 79 రోజుల సుదీర్ఘ విరామం అనంతరం సోమవారం రాజోలు మండలం పొదలాడ నుంచి యాత్రాను లోకేశ్‌ ప్రారంభించారు. పాదయాత్ర పున్ణప్రారంభం సందర్భంగా పెద్ద ఎత్తున టిడిపి నాయకులు, కార్యకర్తలు పొదలాడకు చేరుకున్నారు. గతంలో నిర్దేశించిన మార్గంలో కాకుండా ఈ సారి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రాజోలు, పి.గన్నవరం, అమలాపురం, ముమ్మిడివరం, కాకినాడ నగరం, కాకినాడ గ్రామీణం, పిఠాపురం, తుని నియోజకవర్గాల మీదుగా యాత్ర సాగేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. పాదయాత్రలో భాగంగా రాజోలులోని తాటిపాక సెంటర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సంక్షోభాలు, పోరాటాలు టిడిపికి కొత్త కాదన్నారు. 10 ఉమ్మడి జిల్లాల పరిధిలో 2,853 కిలోమీటర్లు మేర ఇప్పటికే పాదయాత్ర చేశానన్నారు. అన్ని రంగాల వారి సమస్యలను తెలుసుకున్నానని తెలిపారు. చంద్రబాబుపై, తనపై వందల కేసులు పెడుతున్నారన్నారు. వాటికి భయపడేది లేదన్నారు. వైసిపి పాలనలో దళితుల మానప్రాణాలకు రక్షణ కరువైందన్నారు. ఎంత మంది ఎస్‌సి బిడ్డలను పొట్టన పెట్టుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జగన్‌కి రెండు బటన్స్‌ ఉంటాయని,బ్లూ బటన్‌ నొక్కగానే ఖాతాలో రూ.10 పడుతుందని, రెడ్‌ బటన్‌ నొక్కగానే అదే ఖాతా నుంచి రూ. 100 మాయవుతుందన్నారు. విద్యుత్‌ ఛార్జీలు 9 సార్లు, బస్‌ఛార్జీలు మూడుసార్లు పెంచారన్నారు. చెత్తపై కూడా పన్నులు వేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా అని చెప్పి జగన్‌ మోసం చేశాడన్నారు. జాబ్‌ క్యాలెండర్‌ జాడే లేదన్నారు. డిఎస్‌సిని పూర్తిగా మరిచారన్నారు. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ కలిసి మహాశక్తి ప్రకటించారన్నారు. ఈ పథకాలను ఒక్కొక్కటిగా ఆయన వివరించారు. తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ, ప్రయివేటు, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3వేలు ఇస్తామని ప్రకటించారు. పెండింగ్‌ పోస్టులన్ని భర్తీ చేస్తామన్నారు. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మోటార్లకు మీటర్లు పెడుతున్నారన్నారు. ఆ మీటర్లు రైతులకు ఉరితాళ్లు అన్నారు. మీటర్లు బిగిస్తే పగలగొట్టండి, టిడిపి అండగా ఉంటుందని పిలుపునిచ్చారు. తాము అధికారంలోకొచ్చిన వెంటనే అన్నదాతకు ఏడాదికి రూ.20 వేలు ఇసామన్నారు. ఒఎన్‌జిసి ప్రమాద బాధితులను ఆదుకుంటాం యువగలం పాదయాత్రలో పి.గన్నవరం నియోజకవర్గం నగరం గ్రామానికి చెందిన ఒఎన్‌జిసి, గెయిల్‌ బాధితులు లోకేష్‌ను కలిసి వినతిపత్రం అందించారు. 2014 జూన్‌ 27న జరిగిన అగ్నిప్రమాదంలో 22 మంది చనిపోయారని, అనేకమంది క్షతగాత్రులయ్యారని తెలిపారు. గెయిల్‌ యాజమాన్యం బాధితులు, గ్రామస్తులకు అప్పట్లో ఇచ్చిన హామీలను నేటికీ నెరవేర్చలేదని తెలిపారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడారు. ప్రమాదం జరిగిన పదేళ్లయినా ఒఎన్‌జిసి, గెయిల్‌ అధికారులు ఇప్పటివరకు బాధితులను ఆదుకోకపోవడం దురదృష్టకరమన్నారు. కష్టనష్టాలు ఉన్నప్పటికీ దేశాభివృద్ధి దృష్ట్యా ఇక్కడ ప్రజలు ఒఎన్‌జిసి, గెయిల్‌ సంస్థలకు సహకారం అందిస్తూ వస్తున్నారు. ప్రమాదం సంభవించినపుడు బాధితులను ఆదుకోవాల్సిన పూర్తి బాధ్యత చమురు సంస్థలదేనన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక పేలుడులో ధ్వంసమైన దేవాలయాలు, ముస్లిం పంజాల స్థానంలో కొత్తవి నిర్మిస్తామని, ఒఎన్‌జిసి, గెయిల్‌ అధికారులతో మాట్లాడి బాధితులు, నగరం గ్రామస్తులకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలుచేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. పాదయాత్రలో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, నాయకులు హరీష్‌మాథూర్‌, నిమ్మకాయల చిన్నరాజప్ప, చిక్కాల రామచంద్రరావు, అయితాబత్తుల ఆనందరావు, రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎస్‌.లోహిత్‌ తదితరులు పాల్గొన్నారు. తాటిపాక సెంటర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతున్న లోకేష్‌

➡️