ప్రజాశక్తి- ముమ్మిడివరంఆడిట్ అధికారుల ఆంక్షల పేరుతో తొలగించిన పారిశ ధ్య కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని ముమ్మిడివరం నగర పంచాయతీ చైర్మన్ కమిడి ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. కౌన్సిల్ హాల్లో సోమవారం చైర్మన్ ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. తొలుత 20 అంశాలతో కూడిన అజెండాను ప్రవేశపెట్టి చర్చించారు. ఇటీవల ఆడిట్ అధికారుల ఆదేశాలతో తొలగించిన పారిశుధ్య కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని అధికార ప్రతిపక్ష కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. బైపాస్ రోడ్డులో అనధికార లే అవుట్ వేయడంతో పంటలకు సాగు నీరందక సాగు రైతులు అవస్థలు పడుతున్నారని ప్రతిపక్ష ఫ్లోర్ లీడర్ ములపర్తి బాలకృష్ణ కౌన్సిల్ దష్టికి తీసుకువచ్చినా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారిని అనుకుని బడ్డీలు, షాపులు పెడుతున్నా పట్టణ ప్రణాళిక అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. వార్డుల్లో రహదారులు గోతుల మయంగా మారాయని, కనీసం గ్రావెల్ వేసి పూడ్చాలన్నారు. రూ.4.80 లక్షలతో టెండర్లు పిలిచినా, టెండర్దారుడు ఆ పనులు చేపట్టక పోవడం అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం అన్నారు. కౌన్సిలర్ అడబాల సతీష్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ఆరోగ్య సురక్ష కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వం నిధులు కేటాయించినా, సాధారణ నిధులు కేటాయించడం విచారకరమన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి శంఖు స్థాపన చేసిన అయినాపురం, కాట్రేనికోన రోడ్డుకు రెండేళ్లు గడిచినా ఇప్పటికీ పనులు చేపట్ట లేదని చెప్పారు. సోమిదేవర పాలెంలో ఎస్సి కమ్యూనిటీ భవనానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. 19వ వార్డు కౌన్సిలర్ సౌజన్య వార్డులో ఇంటి పన్నులు వసూళ్లు చేయడంలో అలసత్వం వహిస్తున్నారని చెప్పారు. అనంతరం అక్టోబర్ నెలకు సంబంధించి 1వ పద్దు నుంచి రూ.8 లక్షల 40 వేల 591, 2వ పద్దు నుండి రూ.5 లక్షల 89 వేల బిల్లులను సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సమావేశంలో కమిషనర్ జి.లోవరాజు, మేనేజర్ నూకరాజు, టిపిఒ కె.మంజుల, శానిటరీ సూపర్వైజర్ సత్యనారాయణ రాజు పాల్గొన్నారు.