ప్రయివేట్‌ ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలి : డివైఎఫ్‌ఐ

ప్రజాశక్తి – కడప అర్బన్‌ నగరంలో, జిల్లాలో పేదలు వైద్యం కోసం ప్రయివేట్‌ ఆస్పత్రులకు వెళ్తే ఓపి ఫీజును విపరీతంగా పెంచేసి ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్న ఆసుపత్రుల యాజమాన్యాల పై చర్యలు తీసుకోవాలని డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వీరనాలశివకుమార్‌ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో స్పందనలో డిఆర్‌ఒ దేవేంద్ర గౌడ్‌కు డివైఎఫ్‌ఐ అధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శివకుమార్‌ మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలను జిల్లాలో ప్రయివేట్‌ ఆసుపత్రులు నిలువు దోపిడీ చేస్తున్నాయన్నారు. కడప, ప్రొద్దుటూరు లాంటి ప్రాంతాలలో డాక్టర్‌ కన్సల్ట్‌ ఒక్క ఓపీ ఛార్జి రూ. 400 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తున్నారని చెప్పారు. పేదవాడు వైద్యం చేయించుకోవాలంటే ఖరీదు అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిభందనలు అమలు చేయడం లేదన్నారు. ఆసుపత్రులలోనే మెడికల్‌ షాపులు నిర్వహిస్తూ అర్హత లేకుండా ఫార్మసిస్ట్‌ లేకుండా నడుపుతున్నారని పేర్కొన్నారు. టెస్టులు, స్కానింగ్‌ల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. ఎక్కడా ధరల పట్టిక లేదన్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే ప్రత్యక్షంగా ఆసుపత్రుల ముందు ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో నగర అధ్యక్షులు షాకీర్‌ పాల్గొన్నారు.

➡️