రైతుల కష్టం దళారుల పాలు

paddy farmers problems

ఎక్కడి ధాన్యం అక్కడే
మద్దతు ధర రూ. 1637లు
రైతుకు అందుతున్నది రూ 1460లు
అంతంత మాత్రమే కొనుగోలు కేంద్రాలు

ప్రజాశక్తి-రామచంద్రపురం : తొలకరి ధాన్యం పంట చేతికి వచ్చిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వేగం పుంజుకోకపోవడంతో ఎక్కడి దాన్యం అక్కడే నిలిచిపోయి ఉంది. తుఫాను వర్షాలతో అప్రమత్తమైన రైతులు వేగంగా వరి కోతలు పూర్తి చేశారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ 1637 లు ఉండగా ప్రభుత్వ కొనుగోలు ద్వారా రైతుకు సొమ్ములు తొందరగా అందవని 20 రోజులు ఆలస్యం అవుతుందని తెలపడంతో రైతన్నలు దళారులను ఆశ్రయిస్తున్నారు. దళారులు హమాలీ చార్జీలు ట్రాన్స్పోర్ట్ చార్జీలు మినహాయించుకుని రైతుకు బస్తాకు రూ 1460 లు చెల్లిస్తున్నారు. దీంతో రైతులు బస్తా కు రూ.170 లు వరకు నష్టపోతున్నారు. అయినప్పటికీ సొమ్ములు వేగంగా ఇస్తామని దళారులు రైతులు వద్ద ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఆర్బిఎల్ ద్వారా కొనుగోలు చేసే దాన్యం కేంద్రాల్లో వేగంగా ప్రక్రియ మొదలు కాకపోవడంతో రైతులు దళారులు వద్ద ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. దీంతో రైతన్నలకు నష్టం ఏర్పడుతుంది. హామాలి ట్రాన్స్పోర్ట్ చార్జీలు ప్రభుత్వమే చేరుస్తుందని ప్రకటించినప్పటికీ అది క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. ఆరుగాలం పండించిన పంటకు మద్దతు ధర ప్రకటించిన దానివల్ల దళారులకే అధిక లాభం చేకూరుతుంది. ఇక రవాణా వాహనాలకు జిపిఎస్ విధానం కొనసాగడంతో ట్రాన్స్పోర్ట్ వాహనాలను ఆన్లైన్ చేయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల కొనుగోలు ట్రాన్స్పోర్ట్ మరింత జాప్యం జరగడంతో రైతన్నలు దళారులను ఆశ్రయిస్తున్నారు. దీనికే వ్యవసాయ శాఖ అధికారులు ఆర్ బి కే సిబ్బంది చర్యలు తీసుకుని రైతులంతా ప్రభుత్వానికే ధాన్యం అమ్మే విధంగా చర్యలు చేపట్టాలని దళారుల దోపిడీ నుండి రైతులను కాపాడి వారికి మద్దతు ధర అందేలాగా చర్యలు చేపట్టాలని పలువు రైతులు కోరుతున్నారు.

రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు : ఎమ్మెల్సీ ఇళ్ళ వెంకటేశ్వరరావు

తొలకరి రైతులకు మద్దతు ధర తగ్గడం లేదని ప్రభుత్వానిసరిస్తున్న విధానాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు ఆయన కే గంగవరం మండలంలోని వేణుగోపాలస్వామి ఆలయ భూములను సాగు చేస్తున్న రైతుతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రకటించిన ధర రైతుకు దక్కక పోగా దళారులు కేవలం రూ 1460 లు చెల్లిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరిగిపోవడంతో అన్నిచోట్ల మగతాలు తగ్గిస్తుండగా దేవస్థానం ఎకరాకు రూ 32 వేలు శిస్తులు నిర్ణయించారని దీంతో సామాన్య రైతులకు వ్యవసాయం దండగానే పరిస్థితికి వచ్చారని దేవాదాయ శాఖ భూములకు శిస్తులు తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు చేపట్టాలని, ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, దేవస్థానం భూములకు శిస్తులు తగ్గించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లేకుంటే రైతులకు మరింత నష్టాలు తప్పు అని ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని మరింత ప్రోత్సహించాలని ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు కోరారు.

దళారులకు విక్రయించి నష్టపోవద్దు : ఏవో సత్య ప్రసాద్

తొలకరి ధాన్యాన్ని దళారులకు విక్రయించి రైతులు నష్టపోవద్దని రామచంద్రపురం మండల వ్యవసాయ అధికారి ఎన్ సత్యప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఆయనను సోమవారం ప్రజాశక్తి విలేకరి ప్రశ్నించగా రైతులకు దళారులు తక్కువ మొత్తంలో సొమ్ము చెల్లిస్తున్నారని ఆర్బికే ల ద్వారా విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు ఈ మేరకు రైతులందరిని కలిసి మద్దతు ధర గురించి వివరిస్తున్నామని ఆయన తెలిపారు. అదేవిధంగా వాహనాలకు జిపిఎస్ సిస్టం వల్ల కొంత ఆలస్యం అవుతుందని దీనిపై ఉన్నతాధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన వివరించారు.

➡️