పొదలాడ నుంచి ‘యువగళం’ పునఃప్రారంభం

Nov 27,2023 11:40 #Nara Lokesh, #yuvagalam padayatra
nara lokesh yuvagalam starts

భారీగా చేరిన జనసమూహం
ప్రజాశక్తి-రాజోలు: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర మళ్లీ ప్రారంభమైంది. తెదేపా అధినేత చంద్రబాబు అరెస్ట్లో తాత్కాలికంగా నిలిచిన పాదయాత్ర.. 79 రోజుల విరామం అనంతరం సోమవారం తిరిగి మొదలైంది. ఉదయం 10.19 గంటలకు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం పొదలాడ నుంచి లోకేశ్ తన పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్ర పునః ప్రారంభం సందర్భంగా పెద్ద ఎత్తున తెదేపా కార్యకర్తలు, ముఖ్యనేతలు అక్కడికి చేరుకున్నారు. దీంతో పొదలాడ పరిసర ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది.సెప్టెంబరు 8న పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించిన యాత్ర రాజోలు మీదుగా పొదలాడ చేరుకుంది. ఆ మరుసటి రోజు తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు కావడంతో లోకేశ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. చంద్రబాబుకు ఇటీవల బెయిల్ మంజూరు కావడంతో యాత్రను మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించారు. గతంలో నిర్దేశించిన మార్గంలో కాకుండా.. ఈ సారి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రాజోలు, పి.గన్నవరం, అమలాపురం, ముమ్మిడివరం, కాకినాడ నగరం, కాకినాడ గ్రామీణం, పిఠాపురం, తుని నియోజకవర్గాల మీదుగా యాత్ర సాగేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. రోజుకు 15 కి.మీ. నుంచి 20 కి.మీ.మేర పాదయాత్ర, మధ్యలో బహిరంగ సభలు, స్థానికులతో ముఖాముఖి నిర్వహిస్తూ ముందుకు సాగనున్నారు.

➡️