ఉత్తరకాశీ టన్నెల్‌ ఘటన : నిట్టనిలువుగా డ్రిల్లింగ్‌ ప్రారంభం

  • ఈ నెల 30లోగా పూర్తి చేయాలని లక్ష్యం
  • 15వ రోజూ సొరంగంలోనే కార్మికులు

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌లోని ఉత్తర్‌కాశీలో టన్నెల్‌ కూలిన ప్రమాదం నుంచి కార్మికులను బయటకు తీసుకుని రావడం ఆదివారం కూడా సాధ్య పడలేదు. దీంతో వరసగా 15 రోజు కూడా 41 మంది కార్మికులు సొరంగంలోనే చిక్కుకుని ఉన్నారు. సమాంతరంగా తవ్వేందుకు ఉద్దేశించిన ఆగర్‌ యంత్రం విరిగిపోవడంతో సహాయక కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. ప్రత్యామ్నాయాల్లో భాగంగా కొండ ఎగువ భాగం నుంచి నిట్టనిలువునా కిందకు తవ్వే ప్రక్రియను ఆదివారం ప్రారంభించారు. ఈ ప్రక్రియలో మొత్తం 86 మీటర్లను 100 గంటల్లో అంటే ఈ నెల 30 లోపు తవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆదివారం సుమారు 19.5 మీటర్ల దూరం తవ్వినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలోకి భారత సైన్యం కూడా రంగంలోకి దిగింది. ధ్వంసమైన ఆగర్‌ యంత్రాన్ని బయటకు తీయడం, డ్రిల్లింగ్‌లో నిమగం కానుంది. అంతా సజావుగా సాగితే 100 గంటల్లోనే కూలీల వద్దకు చేరుకుంటాం. చుట్టుపక్కల తవ్వే యంత్రాలు కూడా ఆదివారం రాత్రికి సిల్‌క్యారా చేరుకోనున్నాయి’ అని ఎన్‌హెచ్‌ఐడీసీఎల్‌ ఎండీ మహమూద్‌ అహ్మద్‌ వెల్లడించారు. సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చేందుకు ఆరు ప్రణాళికలు అమలు చేస్తున్నామన్న ఆయన.. ఇందులో సమాంతరంగా తవ్వుకుంటూ వెళ్లడమే ఉత్తమమైందని అన్నారు. మరోవైపు ఈ పనుల పర్యవేక్షనకు డ్రోన్లను కూడా వినియోగిస్తున్నారు.

➡️