ప్రజాశక్తి- చోడవరం
చోడవరం మండలంలో సుమారు 1500 ఎకరాల్లో వరి పంట వర్షాలు లేక నిలువునా ఎండిపోయింది. గంధవరం, ముద్దుర్తి, వెంకన్నపాలెం, బుచ్చయ్యపేట, కొత్తపల్లి, జన్నవరం, నరసాపురం, రేవళ్లు, లక్కవరం, దామనపల్లి, మైచర్లపాలెం తదితర గ్రామాల్లో ఎండిన వరి పొలాలు దర్శనమిస్తున్నాయి. వందలాది ఎకరాలు పంట పోయిన కరువు మండలంగా ప్రకటించకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ రైతు భరోసా కేంద్రాలు ఉన్న రైతులకు సేవలు అందించడంలో మాత్రం వెనుకబడి ఉన్నాయని విమర్శిస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల్లో క్షేత్రస్థాయిలో వ్యవసాయ సిబ్బంది ఉన్న వారు పంట నమోదు నివేదికలు అధికారులకు అందించిన ఫలితం శూన్యంగా కనిపిస్తుంది. రాష్ట్రంలో కరువు మండలాలు ప్రకటించి చోడవరం వంటి మండలం లేకపోవడం శోయనీయమన్నారు. ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల కోసం ఊదరగొట్టడం తప్ప నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలన్న ధ్యాస లేదన్న విమర్శించారు. వేలాది రూపాయలు పెట్టామని, కనీసం పశుగ్రాసానికైనా గడ్డి కూడా రాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మునుపెన్నడూ ఇటువంటి వర్షాభావ పరిస్థితులు చెవి చూడలేదని వారు వాపోయారు. అధికారులు తమ పొలాలను పరిశీలించి నష్టపరిహారం అందేలా చూడాలని వారు డిమాండ్ చేస్తున్నారు.