మూడేళ్లయినా నిర్మాణానికి నోచని పెదమట్టపల్లి – నర్సంగపేట రహదారి
రాళ్లు తేలిపోయి ప్రయాణం నరకప్రాయం
వర్షాలు కురిస్తే బురదమయం
ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు
ప్రజాశక్తి-విఆర్.పురం
మండలంలోని పెదమట్టపల్లి – నర్సంగపేట వరకు రహదారి నిర్మాణానికి అప్పటి వరకు ఉన్న రోడ్డును తవ్వి వదిలేశారు. మూడేళ్లయినా నేటికీ దాని నిర్మాణం చేపట్టలేదు. దీంతో రహదారిపై రాళ్లు తేలిపోయి ప్రయాణం నరకప్రాయంగా ఉండగా, వర్షాలు పడితే ముడుకుల లోతు బుదరలో రాకపోకలు సాగించాల్సిన దుస్థితి నెలకొంది. నిధులు లేమితో పంచాయతీలు, మండల ప్రజాపరిషత్ మూలుగుతున్నాయి. ఒకప్పుడు కాంట్రాక్టర్లు ప్రభుత్వ నిర్మాణాలు చేయాలంటే ఎంతో ఉత్సాహంగా పోటీ పడేవారు. ఇప్పుడు పిలిచి పనులిస్తామన్నా చేయడానికి ముందుకు ఎవరూ రావడం లేదు. అధికార పార్టీ కార్యకర్తలే కాంట్రాక్టర్లుగా ఉన్నా బిల్లులు వస్తాయన్న నమ్మకం లేక వారు కూడా ఈ కాంట్రాక్టు పనులు చేయడానికి వెనుకాడుతున్నారు.విఆర్.పురం మండలంలో గ్రామాల్లో అంతర్గత రోడ్లకు దిక్కులేదు సరికదా… కనీసం గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారుల నిర్మాణం కూడా చేయలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. పెదమట్టపల్లి నుండి కుందులూరు మీదుగా నర్సంగపేట వరకు ఉన్న 20 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.4.33 కోట్లు మంజూరు కాగా, మూడేళ్ల క్రితం ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్, ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి శంకుస్థాపన చేశారు. కాంట్రాక్టరు ఈ రోడ్డును తవ్వి వదిలేశారు. కుందులూరు గ్రామానికి ముందు రెండు కిలోమీటర్లు మాత్రం కంకర పోశారు. మూడేళ్లయినా నేటికీ ఈ రహదారి నిర్మాణం చేయలేదు. దీంతో రాళ్లు తేలిపోయి ఈ రహదారిలో ప్రయాణం నరక ప్రాయంగా మారింది. వర్షాలు కురిస్తే మోకాళ్లలోతు బురదలో ఇబ్బంది పడాల్సి వస్తోంది. 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రం విఆర్.పురం వెళ్లాలంటే వాహనాల రాకపోకలు సాగడం లేదు. దీంతో ప్రభుత్వ కార్యాలయాలకు, ఆసుపత్రి, బ్యాంకులకు, నిత్యావసర సరుకులు తెచ్చుకోవడానికి మండల కేంద్రానికి వెళ్లాలంటే 16 గిరిజన గ్రామాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. అలాగే తెల్లవారిగూడెం నుండి గుల్లేటివాడ వరకు సుమారు 3.2 కిలోమీటర్ల బిటి రోడ్డుకు రూ.159.29 లక్షలు నిధులు మంజూరు కాగా, రెండేళ్ల క్రితం మెటల్ వేసి వదిలేశారు. ఈ రహదారుల నిర్మాణం పూర్తి చేయాలని స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి, అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదు. తక్షణమే ఈ రహదారుల నిర్మాణం చేపట్టి పూర్తి చేయాలని ఆయా గ్రామాల గిరిజనులు కోరుతున్నారు.కారంగూడెం బిటి రోడ్డు జంక్షన్ నుండి ఎజి కోడేరు వరకు, జల్లివారిగూడెం నుండి బంగారుగూడెం వరకు రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. వాటిని మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు. కుందులూరు బిటి రోడ్డు నుండి జల్లివారిగూడెం వరకు, కందులూరు నుండి టేకులూరు వరకు, గొల్లగూడెం నుండి వీరపాపన్నగూడెం వరకు బిటి రోడ్డుకు నిధులు మంజూరు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కొన్ని కోట్ల రూపాయలు గిరిజనలకు ఖర్చు పెడుతున్నామని ప్రభుత్వం, అధికారులు చెపుతున్నా, కనీసం చిన్న గ్రామాలకు రహదారులు కూడా వేయలేని దుస్థితి నెలకొంది. ఓట్ల పండుగ దగ్గరకొస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గ్రామాలకు రోడ్ల నిర్మాణం చేయాలని గిరిజనులు కోరుతున్నారు.అంబులెన్స్ కూడా రావడం లేదుఉన్న రోడ్డును తవ్వేసి, మూడేళ్లగా నిర్మాణం చేయకపోవడంతో రహదారి మొత్తం గోతులు మయంగా మారింది. వాహనాలు రాకపోకలకు వీలుగా రహదారి లేకపోవడంతో మండల కేంద్రానికి వెళ్లాలంటే అనేక అవస్థలు పడుతున్నాం. రోడ్డు బాగోలేక మా గ్రామానికి 108, 104 అంబులెన్స్‌లు కూడా రావడం లేదు. ఇప్పటికైనా మా గోడు ఆలకించండి.- తెల్లం అప్పారావు, తెల్లంవారిగూడెంఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదుఈ రహదారి విషయమై అనేక మార్లు అధికారులను, ప్రజా ప్రతినిధులకు విన్నవించాం. వారిని కలిసి అడిగాం. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో 16 గ్రామాలు గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు.- తెల్లం తమ్మయ్య, తెల్లంవారి గూడెంతక్షణమే నిర్మాణం పూర్తి చేయాలిరహదారి తవ్వి వదిలేయడంతో వర్షం పడితే బురదమయంగా ఉంటుంది. ఈ రహదారి దుస్థితిని ప్రభుత్వానికి, అధికారులకు తెలియజేయడానికి రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన తెలియజేశాం. అయినా ఎవరిలోనూ చలనం లేదు. ఎన్నేళ్లు ఈ బాధలు పడాలి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెద్దమట్టపల్లి నుండి తెల్లంవారిగూడెం మీదుగా నర్సింగపేట వరకు రహదారి నిర్మాణం పూర్తి చేయాలి. – తెల్లం కన్నమ్మ మాజీ సర్పంచ్