వైద్యరంగంలో మానవత్వం ఎక్కువ

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : కోవిడ్‌ సమయంలో వైద్య రంగమే మానవత్వాన్ని చాటుకుందని రాష్ట్ర జ్యూడిషల్‌ అకాడమీ డైరెక్టర్‌ ఎ.హరిహరనాథశర్మ అన్నారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్‌)లోని సుశృత హాలులో ఆదివారం జరిగిన రాజ్యాంగ ఆమోద దినోత్సవ సభ నిర్వహించగా సభకు డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీనివాస ప్రసాద్‌ అధ్యక్షత వహించారు. రాజ్యాంగ హక్కుపై హరిహరనాథశర్మ ప్రమాణం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మానవజాతి ఉన్నంత వరకు వైద్య రంగం చేసిన సేవలను ఎన్నడూ మరువ లేమని అన్నారు. కోవిడ్‌ సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి వైద్యులు వైద్య సేవలు అందించారని కొనియాడారు. వైద్య రంగంతో పాటు పారిశుధ్యం, పోలీసు వ్యవస్థ బాగా పని చేశాయని గుర్తు చేశారు. గ్రామాల్లో వైద్యులు పని చేయాలని రాజ్యాంగం చెబుతోందని, రాజ్యాంగ బద్ధమైన చట్టం ఎంతో ఉన్నతమైందని, రాజ్యాంగ నీతికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని చెప్పారు. రాజ్యాంగం పట్ల గౌరవం, నమ్మకంతో ముందుకెళ్తే విజయం సాధించడం చాలా తేలికైనా పని అన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన జీవించే హక్కు గుండెకాయ వంటిదని, ఆర్టికల్‌ 21లో ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ప్రసాదించిందని నొక్కి చెప్పారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను భంగం కలిగించకూడదన్నారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిరణ్‌ కుమార్‌, సివిల్‌ సర్జన్‌ ఆర్‌ఎంఒ డాక్టర్‌ సతీష్‌ కుమార్‌, నాట్కో కో-ఆర్డినేటర్‌ యడ్లపాటి అశోక్‌ కుమార్‌, డిఎంఇ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ అనిల్‌ పాల్గొన్నారు.జిల్లా పోలీసు కార్యాలయంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని నిర్వహించారు. డాక్టర్‌ బి ఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి అడ్మిన్‌ అడిషనల్‌ ఎస్‌పి సుప్రజ, క్రైమ్‌ అదనపు ఎస్పీ శ్రీనివాసరావు పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. స్పెషల్‌ బ్రాంచ్‌ సిఐ బాలసుబ్రమణ్యం, ఆర్‌ఐలు ధామస్‌రెడ్డి, రాజారావు, రమేష్‌ కృష్ణన్‌, రాఘవయ్య, బ్రహ్మానందం పాల్గొన్నారు.

➡️