యుటిఎఫ్‌కు ఎల్లప్పుడూ సహకరిస్తాం

ప్రజాశక్తి-దర్శి : యుటిఎఫ్‌కు తాము ఎల్లప్పుడు అండగా ఉంటామని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ తెలిపారు. యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో దర్శిలో నూతనంగా నిర్మించిన దాచూరి రామిరెడ్డి యుటిఎఫ్‌ భవనాన్ని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం ఆదివారం ప్రారంభించారు. అనంతరం జిల్లా 49వ కౌన్సిల్‌ సమావేశాలు స్థానిక పిజిఎన్‌ కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ ఈ సమావేశానికి యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి ధనిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బూచేపల్లి వెంకాయమ్మ 2024లో బూచేపల్లి సుబ్బారెడ్డి దర్శిలో పోటీ చేసినప్పుడు దాచూరి రామిరెడ్డి సహకారంతో యుటిఎఫ్‌ తమకు సహకరించిందన్నారు. అందుకే ఆయన పేరుమీదుగా నిర్మించిన భవనానికి తాము తమవంతు సహకారం అందించినట్లు తెలిపారు. బూచేపల్లి సుబ్బారెడ్డి ఆశయాలకు అనుగుణంగా తాను, తమ కుమారుడు శివప్రసాద్‌రెడ్డి యుటిఎఫ్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటూ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. తొలుత యుటిఎఫ్‌ కార్యాలయం నుంచి గడియారస్తంభం సెంటర్‌ వరకూ ర్యాలీ నిర్వహించారు. యుటిఎఫ్‌ జెండాను ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు వీరారెడ్డి ఆవిష్కరించారు. విద్యార్థులు కోలాటం ప్రదర్శించారు. ఈ సందర్భంగా సీనియర్‌ ఉపాధ్యాయులను సన్మానించారు. అనంతరం జిల్లా కౌన్సిల్‌ సమావేశం, నూతన కమిటీ ఎన్నిక నిర్వహించారు. ఈ కార్యక్రమలో యుటిఎఫ్‌ మండల అధ్యక్షుడు మీనిగ శ్రీను, మండల ప్రధాన కార్యదర్శి కాసిం, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, యుటిఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్‌, రాష్ట్ర గౌరవాధ్యక్షుడు శ్రీనివాసరావు, గౌరవ ప్రధాన కార్యదర్శి బాబురెడ్డి, రాష్ట్ర ఆడిట్‌ కమిటీ సభ్యుడు రమణారెడ్డి, ఎంపిపి సుధారాణి, వైస్‌ ఎంపిపి సోము దుర్గారెడ్డి, ఎంపిడిఒ కుసుమ కుమారి,ఎంఇఒ కాకర్ల రఘురామయ్య, నాయకులు అబ్దుల్‌ హై, జి.ఉమామహేశ్వరి, కోటేశ్వరరావు, ఐదు మండలాల యుటిఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.శ్రీనివాసులురెడ్డి, మాధవరావు, వెంకటరెడ్డి, రోశయ్య, తిరుపతిరెడ్డి, శ్రీనివాసరావు, నాగాజు, ఎస్‌.కోటయ్య, టి.రాజశేఖర్‌, రామిరెడ్డి, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపై యుటిఎఫ్‌ నిరంతర పోరాటం : విఠపు ఉపాధ్యాయుల సమస్యలపై యుటిఎఫ్‌ నిరంతరం పోరాటం కొనసాగిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. ప్రభుత్వ సంస్కరణల వల్ల ఎన్నడు లేని విధంగా దాదాపు 5 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో తగ్గారన్నారు. రాష్ట్రంలో 34వేల ప్రాధమిక పాఠశాలలు ఉంటే అందులో 12వేలు ఏక ఉపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రభుత్వ పాఠశాలలకు రూ.63వేల కోట్లు ఖర్చు చేశారని, పిల్లల హాజరు 22 శాతం పెరిగినట్లు చెబుతున్నారన్నారు. సంస్కరణలో భాగంగా 3.75 లక్షల మంది విద్యార్థులు బయటకు వెళ్లిపోయారన్నారు. మరో 1.50లక్షల మంది పిల్లలు కూడా అనధికారికంగా బయటకు వెళ్లినట్లు తమ వద్ద లెక్కలు ఉన్నాయన్నారు. ప్రభుత్వ రంగాన్ని కాపాడాల్సిన ప్రభుత్వాలు సంస్కరణల మూలంగా ప్రభుత్వ పాఠశాలలు దెబ్బతింటున్నాయన్నారు. ఒరిస్సాలో 81 శాతం విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో పెరిగారన్నారు. మన రాష్ట్రంలో మాత్రం తగ్గారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం పాత పెన్షను విధానాన్ని కొనసాగించాలన్నారు.

➡️