ప్రజాశక్తి – సీతానగరం
ఈ నెల 27, 28 తేదీల్లో విజయవాడలో జరుగుతున్న మహాధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజులోవ, ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె. అన్నామని, జిల్లా కోశాధికారి ఎం. వెంకటలక్ష్మి పిలుపునిచ్చారు. ఆదివారం స్థానికంగా సిఐటియు మండల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని, స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, పిఎపిఎస్సి గ్రాడ్యుటీ అమలు చేయాలని, ఏ రంగంలో పనిచేసే కార్మికుడికైనా కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, పంట రుణాలు అందించాలని, ఉపాధి కార్మికులకు రోజుకి రూ.600 వేతనం, 200 రోజుల పని దినాలు, పట్టణాల్లో కూడా అమలు చేయాలనే డిమాండ్లతోపాటు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లు రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని, విశాఖ ఉక్కు ప్రయివేటుకరణ ఆపాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాలు, రైతాంగ సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో ఈ మహాధర్నా జరుగుతుందని తెలిపారు. కావున నవంబర్ 27, 28 తేదీలలో విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో జరగబోయే మహాధర్నా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు ఎం.కుమారి, తదితరులు పాల్గొన్నారు.