12 నుంచి తపాలా ఉద్యోగుల సమ్మె

Nov 27,2023 09:08 #Postal workers strike

– కమలేష్‌ చంద్ర సిఫార్సులు అమలు చేయాలి

– ఎఐజిడిఎస్‌యు జాతీయ ప్రధాన కార్యదర్శి మహదేవయ్యా

ఉద్యోగుల పోరాటానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు సంఘీభావం

ప్రజాశక్తి-వన్‌టౌన్‌ (విజయవాడ) చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలకు పరిష్కారం కోరుతూ డిసెంబర్‌ 12 నుంచి తపాలా ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగాలని నిర్ణయించినట్లు ఆలిండియా గ్రామీణ డాక్‌ సేవక్స్‌ యూనియన్‌ (ఎఐజిడిఎస్‌యు) జాతీయ ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌.మహదేవయ్య తెలిపారు. డిసెంబరు 4 నుంచి జరగనున్న పార్లమెంట్‌ సమావేశాల్లో తపాలా ఉద్యోగుల సమస్యలపై చర్చించి వాటిని పరిష్కరించాలని, కమలేషన్‌ చంద్ర కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. యూనియన్‌ ఎపి సర్కిల్‌ సర్వసభ్య సమావేశం, నిరవధిక సమ్మెపై అవగాహనా సదస్సు ఎన్‌టిఆర్‌ జిల్లా విజయవాడ వన్‌టౌన్‌లోని తపాలా ప్రధాన కార్యాలయంలో ఎపి సర్కిల్‌ నాయకులు బి.వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో మహదేవయ్య మాట్లాడుతూ గ్రామీణ డాక్స్‌ సేవకులకు ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. 12, 24, 36 అదనపు సర్వీస్‌ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని కోరారు. దేశ వ్యాప్తంగా తపాలా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అనేకసార్లు ఉద్యమాలు చేసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో నిరవధిక సమ్మెకు వెళ్తున్నామని తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 28న పార్లమెంట్‌ సభ్యులకు వినతి పత్రాలు అందజేసి తమ సమస్యను పార్లమెంట్‌ దృష్టికి తీసుకురావాలని కోరతామన్నారు. డిసెంబరు 1 నుంచి 10వ తేదీ వరకు డివిజన్‌ స్థాయిలో సభ్యులకు అవగాహన కలిగించి సమ్మెకు సిద్ధం చేస్తామని తెలిపారు. 11న అన్ని సర్కిళ్ల పరిధిలోని ఉప, ప్రధాన తపాలా కార్యాలయాల ఎదుట భోజన విరామ సమయంలో నిరసనలు తెలుపుతామని చెప్పారు. డిసెంబరు 12 నుంచి శాంతియుతంగా నిరధిక సమ్మె కొనసాగిస్తామని తెలిపారు. తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలను కోరారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. గ్రామీణ డాక్‌ సేవకులు బలమైన యంత్రాంగంగా ఉందని, దీనిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 7వ వేతన కమిటీలో న్యాయమైన హక్కులను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తపాలా ఉద్యోగులకు సిపిఎం తరుపున సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ.. కార్మికులు ఐక్యంగా పోరాడి తమ హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. రైల్వేలు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, ఖనిజాలు లాంటి ప్రధాన రంగాలను ప్రయివేటు సంస్థలకు అప్పగిస్తే సామాన్య ప్రజలకు ఎలాంటి హక్కులూ ఉండవన్నారు. కేంద్రం దిగివచ్చి తపాలా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. బిసివై పార్టీ రాష్ట్ర కార్యదర్శి అనూష్‌, ఎపి నిరుద్యోగ జెఎసి కన్వీనర్‌ పవన్‌కుమార్‌, సర్కిల్‌ కార్యదర్శి వై.మర్రెడ్డి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి తపాలా ఉద్యోగులు, గ్రామీణ డాక్‌ సేవకులు పాల్గొన్నారు.

➡️