నగరవనం పనులు పరిశీలిస్తున్న మంత్రి
‘నగరవనం’ పనులు పరిశీలన
ప్రజాశక్తి -నెల్లూరునగరానికి తలమానికంగా అటవీశాఖ అన్ని సదుపాయాలతో నగరవనం తీర్చిది ద్దుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. రూరల్ మండలం, కొత్తూరు సమీపంలో అటవీశాఖ నిర్మించిన నగరవనంను మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా కాలినడకన నగరవనంలో తిరుగుతూ జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం నగరవనంలో మొక్కలు నాటారు. అటవీ శాఖ ద్వారా చేపట్టిన పనులను జిల్లా అటవీ శాఖ అధికారి చంద్రశేఖర్ మంత్రికి వివరించారు. ప్రకతి ప్రేమికులను ఆకర్షించే విధంగా ప్రతి ఒక్కరు ఉత్సాహంగా, ఉల్లాసంగా నగరవనాన్ని దర్శించే విధంగా అన్ని సదుపాయాలతో తీర్చిదిద్దడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. నగరం కాంక్రీట్ జంగిల్ గా మారిన పరిస్థితుల్లో ప్రకతిని ఆస్వాదించడానికి, నగరవాసులకు పరిసర ప్రాంత ప్రజలకు ఈ వనం పెద్ద ఊరట కలిగిస్తుందన్నారు. 145 హెక్టార్లలో నిర్మించిన ఈ నగర వనం పనులు సుమారుగా 90 శాతం పూర్తయ్యాయని, త్వరలో ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డి , అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లాలోని ఎంఎల్ఎలు, ఎంఎల్సిలు,చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ తదితరులను ఆహ్వానించి త్వరలో ప్రారంభోత్సవం చేసుకోనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, డీఎఫ్ఓ చంద్రశేఖర్ తో పాటు రేంజ్ అధికారులు మాల్యాద్రి, రవీంద్రబాబు, మహేశ్వర్ రెడ్డి, మోహన్ రావు ఉన్నారు.