కొత్తగూడెం : కొత్తగూడెం సీపీఐ కార్యాలయంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం చావు నోట్లో తల పెట్టాను అనటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఖమ్మం ఆస్పత్రిలో వైద్యం చేయించుకొని జ్యూస్ తాగిన తర్వాత.. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆగ్రహిస్తే మాట మార్చిన విషయం కేసీఆర్ మర్చిపోతే ఎలా అని విమర్శించారు. కేసీఆర్ దీక్షకు సంబంధించి ఖమ్మం పట్టణానికి చెందిన అతని వైద్యుడు గోపీనాథ్ కేసీఆర్ ఎంత నిబద్ధతతో దీక్ష చేసాడో పూర్తి నివేదికను తమకు అందించడం జరిగిందని తెలిపారు.బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటే కాబట్టి లిక్కర్ కేసులో కవితను అరెస్టు చేయలేదని సీపీఐ నారాయణ ఆరోపించారు. ఎన్నికల కోడ్ ఉన్నా కానీ.. ఎలక్షన్ కమిషన్ రైతుబంధుకు అవకాశం కల్పించటం బీఆర్ఎస్, బీజేపీ మైత్రికి నిదర్శనమని తెలిపారు. జాతీయ ఎలక్షన్ కమిషనర్ గా గుజరాత్ కు చెందిన మూడో ర్యాంకు వ్యక్తి ఉండటం దీనికి కారణమని పేర్కొన్నారు. మరోవైపు.. గడ్డం వివేక్ బీజేపీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి రాగానే అవినీతిపరుడై వేలకోట్లు సంపాదించాడా అని ప్రశ్నించారు. అతనిపై ఈడీ, ఐటీ దాడులు.. ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పై ఐటీ దాడులు చేయించడం బీజేపీ, బీఆర్ఎస్ స్నేహాన్ని తెలియజేస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా.. కొత్తగూడెంలో ప్రజల కోసం పనిచేసే కూనంనేని సాంబశివరావు గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.