ప్రజాశక్తి – సీతానగరం
రాజమహేంద్రవరం నుంచి సీతానగరం వరకూ నాలుగు లైన్ల రోడ్డును అసంపూర్తిగా వదిలేయడంతో ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని రాజానగరం నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జ్ బొడ్డు వెంకట రమణ చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. అసంపూర్తి రోడ్డులో జరిగిన ప్రమాదాల్లో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను, గాయాలపాలైయిన వారిని శనివారం ఆయన పరామర్శించారు. మృతుల కుటుంబాల పరిస్థితిని, గాయపడి మంచానపడిన వారి స్థితిగతులను ఆయన అడిగి తెలుసుకున్నారు. రాజంపేట గ్రామానికి చెందిన దూళ్ళ దుర్గాప్రసాద్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆయన కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ కుటుంబ సభ్యులకు రూ.25 వేలు సాయాన్ని అందించారు. టిడిపి తరుపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వెదుళ్ళపల్లి గ్రామానికి చెందిన ఆచంట చిట్టబ్బాయిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసంపూర్తి రోడ్డు నిర్మాణంలో, ఎటువంటి నిర్మాణ జాగ్రత్తలు, ప్రమాద సూచికలు ఏర్పాటు చేయని కారణంగా 6గురి ప్రాణాలను గాల్లో కలిసి పోయా యని, అనేక మందికాళ్ళు, చేతులు విరిగి పోయి ఆసుపత్రుల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కూనవరం సుద్దమెట్ట వద్దకు చేరుకుని, పేదలకు ఇచ్చిన ఇళ్ళ పట్టాల స్థలాల వద్ద జరుగుతున్న అక్రమ గ్రావెల్ తరలింపుపై తహశీల్దార్ కృష్ణారావును ప్రశ్నించారు. ఇళ్ళ స్థలాలు లబ్ధిదారులకు ఇవ్వాలనే వంకతో అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఎటువంటి అనుమతులు లేకుండా చట్టవిరుద్ధంగా ముగ్గుళ్ళ నుంచి కాతేరుకు గ్రావెల్ రవాణా చేస్తున్నారని ఆయన ఆరోపించారు.