ప్రజాశక్తి – రాజమహేంద్రవరం
నిరంతర ఉద్యమ సారధి కోరుకొండ బ్రహ్మాజీరావు అని పలువురు కొనియాడారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా యుటిఎఫ్ శాఖకు జిల్లా అధ్యక్షులుగా సుదీర్ఘకాలం పనిచేసిన కోరుకొండ బ్రహ్మాజీ రావు (88 ) మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన స్వగృహం వద్ద శనివారం జరిగిన సంతాప సభకు యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు జయకర్ అధ్యక్షత వహించారు. ఈ సంతాప సభలో మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ మాట్లాడుతూ బ్రహ్మాజీ రావు శిష్యుడిని కావడం గర్వంగా ఉందన్నారు. పాటలు, కథల రూపంలో పాఠ్యాంశాలను బోధించడంలో నేర్పరి అని అన్నారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పిడిఎఫ్ ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బ్రహ్మాజీరావుకు జీవోల వ్యాఖ్యతగా, సమస్యలపైన, సంజాయిషీలపైన వ్యాఖ్యాతగా, ఐక్య ఉపాధ్యాయ ప్రశ్నోత్తరాల శీర్షిక నిర్వాహకునిగా, సమస్యల పరిష్కార ప్రతినిధిగా, మంచి ఉపాధ్యాయునిగా పేరు తెచ్చుకున్నారని అన్నారు. యుటిఎఫ్ ఉద్యమంలో ఎన్నో పాత్రలు పోషించిన బ్రహ్మాజీరావుకు ఉద్యమ జోహార్లు అర్పించారు. ఎంఎల్‌సి షేక్ సాబ్జి మాట్లాడుతూ బ్రహ్మజీరావు ఉపాధ్యాయ సమస్యలపై ప్రాతినిత్యం లేఖలు రాసి పరిష్కారం చేసేవారని, కోపం తెలియని మనిషి అని ఒక్క రూపాయి ఆశించకుండా యుటిఎఫ్ ఉద్యమంలో పనిచేసిన ఉద్యమ కారుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి అరుణ్ కుమారి, అన్నారం, రాఘవులు, యుటిఎఫ్ నాయకులు చక్రవర్తి, నగేష్, జ్యోతి బసు, షరీఫ్, వర్మ విజయ గౌరీ, సిఐటియు నాయకులు అరుణ్, సత్తిరాజు, రమేష్, రవిబాబు, దయానిధి, రూపస్ , ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.