పశ్చిమబెంగాల్: రైలు ప్రమాదాలు.. రైళ్లల్లో మంటలు ఇటీవల ఎక్కువయ్యాయి.. తరచూ జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే.. శనివారం మరో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రం.. అసన్ సోల్ జిల్లాలోని కుల్తీ రైల్వేస్టేషన్ తగలబడిపోయింది. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి.. రైల్వే స్టేషన్ లోని ఫుట్ ఓవర్ బ్రిడ్జి సైతం.. మంటలకు కూలిపోయింది. స్టేషన్ లోని ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. కుల్తీ రైల్వేస్టేషన్ లో మంటలతో అప్రమత్తం అయిన రైల్వే స్టేషన్ అధికారులు, సిబ్బంది వెంటే రైల్వేలైన్ విద్యుత్ నిలిపివేశారు. ఆ తర్వాత ఫ్లాట్ ఫాంపై ఉన్న ప్రయాణికులను బయటకు పంపించేశారు. నాలుగు ఫైరింజన్లు మంటలను అదుపు చేశాయి. భారీ ఎత్తున మంటలు వ్యాపించటానికి కారణం.. ఎలక్ట్రికల్ వర్క్ జరుగుతుండటమే అని ప్రాథమికంగా నిర్థారించారు అధికారులు. కేబుల్ వైర్లు, ఇతర ఎలక్ట్రికల్ సామాగ్రి ఉన్న ప్రాంతంలో మంటలు వచ్చాయి.. దీంతో భారీ ఎత్తున వ్యాపించాయని చెబుతున్నారు. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదని.. గాయాలు కూడా కాలేదని వెల్లడిస్తున్నారు. విచారణ తర్వాత ప్రమాదంపై పూర్తి వివరాలు వెల్లడిస్తామన్న కుల్తీ రైల్వేస్టేషన్ అధికారులు.. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత.. ఎలాంటి ప్రమాదం లేదు అని నిర్థారించుకున్న తర్వాత విద్యుత్ సరఫరా పునరుద్దరించి.. రైళ్ల రాకపోకలకు అనుమతిస్తామని వివరించారు.