ప్రత్తిపాడు: కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో వైసిపికి షాక్ తగిలింది. ఇద్దరు ఎంపీపీలు సహా నలుగురు ప్రజాప్రతినిధులు ఆ పార్టీకి రాజీనామా చేశారు. వైసిపి ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్ తీరుతో గత ఏడాదికాలంగా అసంతఅప్తితో ఉన్న వర్గం.. తాజాగా పార్టీని వీడింది. వైసిపికు రాజీనామా చేసిన వారిలో ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి (బుజ్జి), రౌతులపూడి ఎంపీపీ గంటిమళ్ల రాజ్యలక్ష్మి, భద్రవరం ఎంపీటీసీ సభ్యుడు కొప్పుల బాబ్జీ, తూర్పు లక్ష్మీపురం సర్పంచ్ డా.వీరంరెడ్డి నాగభార్గవి ఉన్నారు. వారంతా వైసిపి క్రియాశీల సభ్యత్వాలకు రాజీనామా చేశారు. పార్టీపై గౌరవంతో ఇప్పటి వరకు కొనసాగినా.. ఎమ్మెల్యే వైఖరి, ఇటీవల నిర్వహించిన బస్సు యాత్రలో పార్టీపరంగా కనీస గౌరవం కూడా ఇవ్వలేదని నేతలు విమర్శించారు. బస్సు యాత్రకు తమకు ఆహ్వానం అందించలేదన్నారు. ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడలతోనే రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.