ప్రజాశక్తి – కర్నూలు : కలెక్టరేట్‌తమను రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పని భారం తగ్గించాలని, క్లాప్ డ్రైవర్లకు పెండింగ్‌లో ఉన్న వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కర్నూలు కలెక్టరేట్ ఎదుట మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు శుక్రవారం ధర్నా చేపట్టారు. ధర్నానుద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అంజిబాబు మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేస్తామని అధికారంలోకి రాకముందు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ కార్మికులందరినీ ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టు అండ్ అవుట్‌సోర్సింగ్ కార్పొరేషన్ (ఆప్కాస్)లో విలీనం చేశారని తెలిపారు. ఆప్కాస్‌లో ఉన్నంత వరకు రెగ్యులర్ కారని, ఆప్కాస్ నుంచి మినహాయించి కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మున్సిపాలిటీలో పని చేస్తున్న రెగ్యులర్ కార్మికులకు ఇస్తున్న వేతనాన్ని కాంట్రాక్టు కార్మికులకు ఇవ్వాలన్నారు. నగరాల విస్తీర్ణం, జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని కోరారు. గూడూరు నగర పంచాయతీలో పని చేస్తున్న కార్మికులకు వేతనాల చెల్లింపులో అలసత్వం లేకుండా పిఎఫ్, ఇఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కర్నూలులో పని చేస్తున్న 98 మంది క్లాప్ డ్రైవర్లపెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిఆర్‌ఒకు వినతిపత్రం అందజేశారు