మత్స్యకారులకు అండగా ఉంటాం- ఒఎన్‌జిసి పరిహారం పంపిణీలో సిఎం

Nov 21,2023 21:45 #cm jagan

ప్రజాశక్తి -అమరావతి బ్యూరో :మత్స్యకారులకు రాష్ట్రప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మంగళవారం ఒఎన్‌జిసి పైపులైన్‌ వల్ల జీవనోపాధి కోల్పోయిన డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో మత్స్యకార కుటుంబాలకు పరిహారాన్ని క్యాంపు కార్యాలయం నుండి ఆయన బటన్‌ నొక్కి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకార దినోత్సవం సందర్భంగా సూళ్లూరుపేటకు వెళ్లాల్సి ఉందని, వర్షాల కారణంగా ఆ కార్యక్రమానికి వెళ్లలేకపోయానని చెప్పారు. ఓఎన్‌జిసి పైప్‌లైన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన 23,458 కుటుంబాలకు నెలకు రూ.11,600 చొప్పున ఆరు నెలలకు రూ.69,000 ఇస్తున్నట్లు తెలిపారు. వీరికి ఇప్పటి వరకు మూడు దశల్లో రూ.323 కోట్లు నష్టపరిహారం ఇప్పించినట్లు తెలిపారు. తాజాగా నాలుగో విడతలో రూ.161.86 కోట్లు ఇస్తున్నట్లు తెలిపారు.
విశాఖపట్నంలో 40 బోట్లు కాలిపోయినట్లు తమకు తెలిసిన వెంటనే వాటికి 80 శాతం పరిహారం అందించాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. బోట్లకు ఇన్సూరెన్స్‌ లేదని తెలియడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పులికాట్‌ సరస్సు ముఖద్వారాన్ని పూడిక తీసి, తెరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనుకున్నామని, ఈ నెలఖరులోనో, వచ్చే నెలలోనే ఆ కార్యక్రమం చేపడతామని తెలిపారు. గతంలో ప్రభుత్వంలో ఉన్న వారు మత్స్యకారులను ఆదుకోవాలనే ఆలోచన చేయలేదని అన్నారు. ఈ కార్యక్రమానికి తోడ్పాటు అందించిన ఒఎన్‌జిసి అధికారులకూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు పాల్గన్నారు.

తాజా వార్తలు

➡️