తుపానును సమర్థవంతంగా ఎదుర్కోవాలి

– కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా సన్నద్ధంగా ఉన్నామన్న సిఎస్‌

– జిల్లా స్థాయిల్లో కంట్రోల్‌ రూమ్‌ల ఏర్పాటు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారనుందని, సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ ఆదేశించారు. ఎన్‌డిఆర్‌ఎఫ్‌, కోస్ట్‌ గార్డు, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌, టెలికాం కేంద్ర ప్రభుత్వ శాఖలు, ఏజెన్సీలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయంతో ఉండి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఆయన ఆదేశించారు. తుపాను ముందస్తు జాగ్రత్తలపై శుక్రవారం ఢిల్లీ నుంచి ఎపి, తమిళనాడు, పుదుచ్ఛేరి, ఒడిశా సిఎస్‌లతో రాజీవ్‌ గౌబ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర, జిల్లా స్థాయిలో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. కలెక్టర్లను పూర్తి అప్రమత్తం చేశామని, వాతావరణశాఖ అంచనా ప్రకారం అల్పపీడనం తుపానుగా రానున్న రెండు రోజుల్లో మారనుందని, దాని ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన కోస్తా జిల్లాల్లో ఒక మాదిరి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ నెల 4న చెన్నై- మచిలీపట్నంల మధ్య తుపాను తీరం దాటే అవకాశముందని, ఆ సమయంలో 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లద్దు : సిఎస్‌తుపాను నేపథ్యంలో ఈ నెల 2 నుంచి మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లద్దని సిఎస్‌ జవహర్‌రెడ్డి పేర్కొన్నారు. తుపానును సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా రెండు ఎన్‌డిఆర్‌ఎఫ్‌, 6 ఎస్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచామని తెలిపారు. అలాగే పౌరసరఫరాలశాఖ విభాగం ద్వారా వివిధ రకాల నిత్యావసర సరుకులను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించారు. నీటిపారుదల, ఆర్‌అండ్‌బి, పంచాయతీరాజ్‌ శాఖలను పూర్తిగా అప్రమత్తం చేసి బలహీనంగా ఉన్న వివిధ ఏటి గట్లు, వంతెనల పాయింట్లలో ప్రత్యేక ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రక్షిత మంచినీటి సరఫరా, విద్యుత్తు, టెలికాం, మున్సిపల్‌, వైద్యారోగ్యశాఖల అధికారులనూ అప్రమత్తం చేసినట్లు కేంద్ర కేబినెట్‌ కార్యదర్శికి సిఎస్‌ వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డిజిపి కెవి రాజేంద్రనాథ్‌రెడ్డి, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. అత్యవసర సాయం కోసం ఫోన్‌ నెంబర్లుతుపాను నేపథ్యంలో వాతావరణ సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండేలా కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎమ్‌డి బిఆర్‌ అంబేద్కర్‌ తెలిపారు. ప్రజల అత్యవసర సహాయం కోసం కంట్రోల్‌ రూమ్‌ నెంబర్లు 18004250101, 1070, 112ను సంప్రదించాలన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

➡️