విభజన హామీల సాధనలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

– రాష్ట్ర ప్రభుత్వ తీరుపై పార్లమెంటులో లేవనెత్తాలి- టిడిపి ఎంపిలతో చంద్రబాబు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :విభజన చట్టం హామీల సాధనలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఈ అంశాలను పార్లమెంటులో లేవనెత్తాలని ఆ పార్టీ ఎంపిలకు సూచించారు. శుక్రవారం గన్నవరం విమానాశ్రయం నుంచి ర్యాలీగా ఉండవల్లిలోని నివాసానికి ఆయన చేరుకున్నారు. అనంతరం టిడిపి పార్లమెంటరీ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పార్లమెంటులో ప్రస్తావన ద్వారా జగన్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో వ్యవస్థలు గాడి తప్పి వ్యవహరిస్తున్న విధానాన్ని ప్రస్తావించాలన్నారు. అన్ని విధాలా విఫలమైన జగన్‌ ప్రభుత్వం ఓట్ల జాబితాలో అక్రమాల ద్వారా లబ్ధి పొందాలని చూస్తుందని, దీనిపై ఢిల్లీలో గళం వినిపంచాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద రాష్ట్రానికి నిధులు ఇస్తున్నా సద్వినియోగం చేసుకోవడంలో రాష్ట్రం పూర్తిగా విఫలమైందని సమావేశం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు, ఎంపిలు కె రామ్మోహన్‌నాయుడు, కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్‌, నేతలు నిమ్మల రామానాయుడు, కంభంపాటి రామ్మోహన్‌రావు, టిడి జనార్ధన్‌, గురజాల మాల్యాద్రి పాల్గొన్నారు.

తాజా వార్తలు

➡️