పెద్దల చేతుల్లోని అసైన్డ్‌ భూములను అర్హులైన పేదలకు ఇవ్వాలి

– రెండున్నర రెట్లు మార్కెట్‌ రేటు చెల్లిస్తే క్రమబద్ధీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి

– లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమం- రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తలు

ప్రజాశక్తి ా అమరావతి బ్యూరోపెద్దల చేతుల్లోని అసైన్డ్‌ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అర్హులైన అసైన్డ్‌ లబ్ధిదారులకే యాజమాన్య హక్కులు కల్పించాలని, కోనేరు రంగారావు కమిటీ సిఫార్సుల మేరకు భూమిని పేదలకు పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్‌ చేసింది. విజయవాడలోని బాలోత్సవ్‌ భవన్‌లో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు అధ్యక్షతన ‘భూముల సమస్యలు – ప్రభుత్వ విధానంపై’ ఆదివారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అసైన్డ్‌ భూములు పొందిన పేదలకు 20 ఏళ్లు దాటిన వారికి యాజమాన్య హక్కులు కల్పిస్తామని ప్రభుత్వం చట్ట సవరణ చేసి, పేదలకు యాజమాన్య హక్కులు కల్పిస్తున్నట్లు ఆశ చూపి, జిఓ ఇచ్చిందన్నారు. అనంతరం మార్గదర్శకాల పేరుతో ఎవరు పొజీషన్‌లో ఉంటే వారు మార్కెట్‌ రేటు కంటే రెండున్నర రెట్లు చెల్లిస్తే వారికి భూ యాజమాన్యపు హక్కులు కల్పిస్తామని చెప్పడం దుర్మార్గమన్నారు. కార్పొరేట్లు బ్లాక్‌మనీతో రాష్ట్ర వ్యాప్తంగా వందలాది ఎకరాలు కొనుగోలు చేశారన్నారు. పదెకరాలు పట్టా భూమి ఉంటే దాని పక్కన ఉండే అసైన్డ్‌ భూములను కలిపేసుకున్నారని విమర్శించారు. పేదల భూములను కార్పొరేట్లు, భూస్వాములు, పెత్తందార్లకు కట్టబెట్టేందుకు ప్రభుత్వ రంగం సిద్ధం చేసిందన్నారు. రానున్న కాలంలో అసైన్డ్‌ చట్ట సవరణలపై అన్ని రాజకీయ పార్టీలూ తమ వైఖరి వెల్లడించాల్సిన అవసరం ఉందన్నారు. పేదలకు అండగా రాష్ట్ర వ్యాప్తంగా అసైన్డ్‌ భూముల సమస్యను ప్రధాన అజెండాగా మార్చాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. వామపక్ష పార్టీల ప్రజా ఉద్యమాల ఫలితంగా రాష్ట్రంలో అసైన్డ్‌ భూముల పంపిణీ జరిగిందన్నారు. పరిశ్రమల పేరుతో వందలాది ఎకరాలు కార్పొరేట్లకు ప్రభుత్వాలు భూములు కేటాయిస్తుందని, ఆయా భూముల్లో ఒక్క పరిశ్రమ కూడా పెట్టకపోగా ఆయా కంపెనీల యాజమాన్యాలు బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుంటున్నాయన్నారు. కార్పొరేట్ల కంపెనీలు రాష్ట్రంలో రూ.లక్ష కోట్లు బ్యాంకులకు ఎగనామం పెట్టాయని ఆయన పేర్కొన్నారు. పేదలకు అండగా అసైన్డ్‌ భూముల పరిరక్షణ కోసం వ్యవసాయ కార్మిక సంఘం చేసే ఉద్యమానికి సిపిఎం ప్రత్యక్షంగా మద్దతు ఇస్తుందని శ్రీనివాసరావు ప్రకటించారు.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ.. అసైన్డ్‌దారుల విన్నపాలు స్వీకరించకుండా ఏకపక్షంగా భూస్వాములకు మేలు చేసేందుకు క్రమబద్ధీకరణ పేరుతో భూస్వాముల ప్రయోజనాలను కాపాడేందుకు నిర్ణయం తీసుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల దళిత, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందన్నారు. భూస్వాముల ఆధీనంలోని భూమిని పేదలకు పంచాలని, అసైన్డ్‌ భూములను తిరిగి హక్కుదారులకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దడాల సుబ్బారావు, వి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో అసైన్డ్‌ భూములను పొందిన వారి జాబితాను గ్రామ సచివాలయాల్లో ప్రకటిస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా ఇంత వరకు ఏ గ్రామ, వార్డు సచివాలయంలో జాబితాను బహిర్గత పరచలేదన్నారు. కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సుల మేరకు అర్హులందరికీ భూ పంపిణీ చేపట్టాలని రౌండ్‌ టేబుల్‌ సమావేశం డిమాండ్‌ చేస్తుందన్నారు. 9/77 అసైన్డ్‌ చట్ట సవరణ సందర్భంగా నిజమైన అసైన్డ్‌దారులకే హక్కులు కల్పిస్తామని ప్రభుత్వం చెప్పిన మాటకు కట్టుబడి ఉండాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో సిపిఐ ఎంఎల్‌ (న్యూ డెమోక్రసీ) నాయకులు కె పోలారి, సిపిఐ ఎంఎల్‌ లిబరేషన్‌ నాయకులు హరనాథ్‌, ఎంసిపిఐ (యు) నాయకులు కెస్‌కె ఖాదర్‌ బాషా, ఏజేస్‌, ఎపిడికెఎస్‌ నాయకులు క్రాంతికుమార్‌, ఎపిరైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మర్రాపు సూర్యనారాయణ, ఎపి కౌలు రైతు సంఘం కార్యదర్శి హరిబాబు, బికెఎంయు రాష్ట్ర అధ్యక్షులు కోటేశ్వరరావు, కెవిపిఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న, డిబిఎఫ్‌ అఖిల భారత నాయకులు కొరివి వినయకుమార్‌ తదితరులు పాల్గన్నారు.

➡️