చెరువుల వినియోగంపై సర్వే – ప్రణాళిక, రెవెన్యూ శాఖల నిర్వహణ

Nov 18,2023 21:52 #surway

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి :రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాగు, తాగునీటి చెరువులపై ప్రభుత్వం సర్వే చేయిస్తోంది. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రధానంగా చెరువు మొత్తం విస్తీర్ణం, ఆక్రమణలు, నీటి నిల్వకు ఉన్న అవకాశాలు, నీటిని ఏయే అవసరాలకు వినియోగిస్తున్నారు? ఎంతమంది రైతులు, ప్రజలు ఈ నీటిని వినియోగించుకుంటున్నారు? అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర రెవెన్యూ, ప్రణాళిక శాఖల ఆధ్వర్యంలో ఈ సర్వే జరుగుతోంది. ఈ నెలాఖరు వరకు ఇది కొనసాగనుంది. ఈ చెరువులను మూడు భాగాలుగా విభజించారు. తటాకం/చెరువు, ఊట చెరువు, చెక్‌ డ్యామ్‌లను వేర్వేరుగా నమోదు చేయనున్నారు. ఏ శాఖ పరిధిలో వీటిని నిర్వహిస్తున్నారు? ప్రభుత్వ, ప్రయివేటు వ్యక్తుల పరిధిలో ఉన్న వాటి వివరాలు కూడా నమోదు చేస్తున్నారు. ప్రధానంగా నీటిపారుదల శాఖ, సహకార సంఘం, పంచాయతీ, పురపాలక సంఘం, ప్రభుత్వ ఏజెన్సీ, వ్యక్తిగతంగా నిర్వహణ, వ్యక్తుల సముదాయం, ఇతర ప్రయివేటు సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న జలాశయాలను వేర్వేరుగా నమోదు చేస్తారు. సాగునీటికి వినియోగిస్తున్నారా? లేక ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారా? నీటిపారుదల, పారిశ్రామిక, మత్స్య ఉత్పత్తి, గృహలకు తాగునీటి అవసరాలు, వినోదానికి, మతపరమైన, భూగర్భ జలాల పెంచేందుకు, ఇతర అవసరాలను కూడా నమోదు చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. సాగు నీటికి వినియోగిస్తే ఎంత ఆయకట్టు, ఏయే పంటలు పండిస్తున్నారు? వివరాలు సేకరిస్తున్నారు. వినియోగించకపోతే కారణాలు కూడా నమోదు చేయాలని సూచించారు. ఎండిపోవడం, చెరువు స్థలంలో నిర్మాణాలు పెరగడం, పూడిక తీయకపోవడం, మరమ్మతులు చేయడానికి వీలులేకపోవడం, పారిశ్రామిక వ్యర్థాలు కలవడం, ఉప్పునీరు చేరడం తదితర కారణాల వల్ల వినియోగంలో లేకపోతే ఆ వివరాలు నమోదు చేయాలి. చెరువు నిర్మాణ స్వరూపం, మట్టి కట్టలు, సిమెంట్‌ సైడ్‌ వాల్స్‌, కాంక్రీట్‌ నిర్మాణం తదితర వివరాలు నమోదు చేస్తున్నారు. చెరువులు పునర్‌ నిర్మించిన పరిస్థితి, ఎప్పటి నుంచి వినియోగించకుండా నిరుపయోగంగా ఉంచారో వివరాలు నమోదు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. తాగునీటి చెరువుల కింద ఉన్న గ్రామాల సంఖ్య, ప్రజల సంఖ్య, చెరువులపై ఉన్న ఆక్రమణలు, గట్ల పరిస్థితి, నీటి వనరులను ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు? ప్రధాన నదులు, భారీ జలాశయాల ద్వారా నీరు వస్తున్న తీరు తదితర వివరాలను కూడా నమోదు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

➡️