-కెఆర్‌ఎంబికి నిర్వహణారక్షణ బాధ్యత సిఆర్‌పిఎఫ్‌కు
-నవంబర్ 28కి ముందున్న స్థితి ప్రకారం నీటి విడుదల
-రెండు రాష్ట్రాల అంగీకారం
-శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా అదే స్థితి?
ప్రజాశక్తి-యంత్రాంగం:తెలుగు ప్రజల ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నాగార్జున సాగర్ కేంద్రం గుప్పిట్లోకి వెళ్లిపోయింది. ఇప్పటిదాకా వివాదాలను పరస్పరం చర్చించి, పరిష్కరించుకునే అవకాశం ఉండగా ఇక నుండి కేంద్రం కన్నుసన్నల్లోనే వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. డ్యామ్ రక్షణతో పాటు, నీటి విడుదలను కూడా కేంద్రం తన పరిధిలోకి తీసుకుంది. దీంతో ప్రతి చిన్న అవసరానికి కేంద్రం మీద ఆధారపడాల్సిన పరిస్థితి తెలుగురాష్ట్రాలకు ఏర్పడింది. ఈ మేరకు కేంద్ర హోమ్‌మంత్రిత్వ శాఖ శుక్రవారం చేసిన ప్రతిపాదనలను రెండు రాష్ట ప్రభుత్వాలు అంగీకరించాయి. నవంబర్ 28వ తేదికి ముందున్న ఏర్పాట్ల ప్రకారమే సాగర్ నీటిని విడుదల చేయాలని కేంద్రం తాజాగా చేసిన నిర్ణయానికి కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకున్నాయి. మరో భారీ ప్రాజెక్టు శ్రీశైలంలో కూడా ఇదే రకమైన ఏర్పాట్లు చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. సాగర్ డ్యామ్‌పైకి రాష్ట్ర పోలీసులు దూసుకెళ్లడం, 13వ గేటు వరకు స్వాధీనం చేసుకుని, కుడి కాలువకు నీటిని విడుదల చేయడంతో గురువారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ హోమ్‌శాఖ శుక్రవారం రంగంలోకి దిగింది. రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డిజిపిలతో కేంద్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి అజరుకుమార్ భల్లా వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. రెండు విడతలుగా సాగిన ఈ సమావేశాల్లో కూడా రెండు రాష్ట్రాలు పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి. కేంద్రం చేసిన కొన్ని ప్రతిపాదనలకు చివరకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాయి. వీటి ప్రకారం నీటి విడుదలకు సంబంధించి నవంబర్ 28వ తేదికి ముందున్న పరిస్థితులను పునర్ద్ధురించాల్సి ఉంటుంది. దీనికి తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకారం తెలిపింది. డ్యామ్ నిర్వహణను పూర్తిస్థాయిలో కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు అప్పగించాలని డ్యామ్‌కు ఇకనుండి సిఆర్‌పిఎఫ్ దళాలు రక్షణ కల్పిస్తాయంటూ చేసిన ప్రతిపాదనలకు కూడా ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. కెఆర్‌ఎంబి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో పనిచేస్తుందన్న సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలే కెఆర్‌ఎంబి నిర్ణయాలుగా మారునున్నాయి. అదే జరిగితే, స్థానిక ప్రజల అవసరాలు, ప్రాధాన్యతలకు కేంద్రం ఎలా స్పందిస్తుందన్నది ప్రశ్నార్ధకమే. డ్యామ్‌పైకి వెళ్లడానికి ఏ రాష్ట్రానికి చెందిన అధికారులకైనా సిఆర్‌పిఎఫ్ అనుమతి తప్పనిసరిగా మారనుంది. గుంటూరు, పల్నాడు జిల్లాల నుండి 900 మంది పోలీసులు, తెలంగాణానుండి 700 మంది పోలీసులు రెండు వైపుల మొహరించడంతో శుక్రవారం కూడా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డ్యామ్‌పైకి చొచ్చుకెళ్లిన ఆంధ్రప్రదేశ్ పోలీసులపై తెలంగాణ ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. తెలంగాణ భూభాగంలోకి అక్రమంగా చొచ్చుకొచ్చారని, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించారని విజయపురి సౌత్ పోలీసులు చేసిన ఫిర్యాదుల మేరకు ఈ కేసులు నమోదుచేశారు. నీటి విడుదలను ఆపండిా రాష్ట్రానికి కెఆర్‌ఎంబి లేఖ నాగార్జున సాగర్ నుండి తక్షణం నీటి విడుదలను ఆపాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి కెఆర్‌ఎంబి లేఖ రాసింది. నాగార్జునసాగర్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 15 టిఎంసీల నీటిలో రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్‌లో పెట్టిన 5 టిఎంసిల ఇండెంట్ మేరకు ఇప్పటికే 5.01 టిఎంసీలను ఆంధ్రప్రదేశ్ వాడుకుందని పేర్కొంది. జూన్‌దాకా వేసవి తాగునీటి అవసరాల మేరకు మిగిలిన 10 టిఎంసీల నీటిని జనవరిలో 5 టిఎంసీలు, మార్చి, లేదా ఏప్రిల్‌లో మరో ఐదు టిఎంసీల నీటిని విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో అంగీకరించిందని తెలిపింది.సాగర్, శ్రీశైలంపై నేడు సమీక్ష నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులపై కేంద్రజలశక్తి మంత్రిత్వశాఖ శనివారం సమీక్షించనుంది. సాగర్‌తో పాటు శ్రీశైలం డ్యామ్‌ల వద్ద ఉన్న పరిస్థితులను కూడా ఈ సమావేశంలో సమీక్షించనున్నట్లు తెలిసింది. కేంద్రజలశక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జలవనరులశాఖ ఉన్నతాధికారులతో కృష్ణానదీజలాల సమస్యను సమీక్షించనున్నారు.