సామాజిక న్యాయం మరిచిపోయారా?

Nov 30,2023 22:05 #BV Raghavulu, #press meet

– బిజెపికి వత్తాసు పలుకుతోన్న మూడు పార్టీలు

– సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు

ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి సామాజిక న్యాయం విషయంలో వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు మొసలి కన్నీరు కారుస్తున్నాయని, దేశవ్యాప్తంగా సామాజిక న్యాయానికి తూట్లు పొడుస్తోన్న బిజెపికి ఎందుకు మద్దతు ఇస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆ పార్టీలను సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు డిమాండ్‌ చేశారు. నెల్లూరులోని సిపిఎం కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిటిజన్‌షిఫ్‌ అమెన్‌మెంట్‌ యాక్టు విషయంలో వైసిపి, టిడిపిలు పార్లమెంట్‌లో బలపరిచాయన్నారు. ఎవరు అడ్డువచ్చినా యాక్టును అమలుచేస్తామని కలకత్తాలో అమిత్‌షా చెప్పారని గుర్తు చేశారు. ఇదే అమలు జరిగితే మైనార్టీల హక్కులు పూర్తిగా దెబ్బతింటాయన్నారు. దీనిని దేశంలోని అన్ని విపక్షాలు వ్యతిరేకించాయని, రాష్ట్రంలో వైసిపి, టిడిపి మద్దతు తెలపడం దురదృష్టమన్నారు. ఇప్పటికైనా చట్టసవరణను వ్యతిరేేకిస్తారో? లేదో? చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే మైనార్టీలకు ద్రోహం చేయడానికి ఆ పార్టీలు సిద్ధమయ్యాయని భావించాల్సి వస్తుందన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చాక ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్‌ నిధులు రద్దు చేసిందని తెలిపారు. ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్‌ పునరుద్దించాలని ఎప్పుడైనా కేంద్రాన్ని వైసిపి ప్రశ్నించిందా? అని నిలదీశారు. దీనిపై ప్రశ్నించకుండా సామాజిక బస్సు యాత్ర చేసే హక్కు వైసిపికి లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కులగణనను నిర్వహిస్తుందని, దీనికి ఎలాంటి చట్టబద్ధత లేదని ఇది కేవలం సర్వే మాత్రమేనని చెప్పారు. రానున్న ఎన్నికల్లో సిపిఎం స్వతంత్రంగా వ్యవహరిస్తోందని, బిజెపికి వ్యతిరేకంగా ఎవరైతే పనిచేస్తారో వారితో ముందుకుపోతామని తెలిపారు. నాగార్జున సాగర్‌ నీటి విషయంలో ఇప్పుడు ఘర్షణ వాతావరణ రావడం దురదృష్టకరమన్నారు. సమస్యను సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలని సూచించారు. దొంగ ఓట్లు ఎక్కడున్నా తొలగించాలన్నారు. నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు, ఎం.మోహన్‌రావు పాల్గొన్నారు.

➡️