చరిత్రను వక్రీకరించొద్దు : ఎస్‌ఎఫ్‌ఐ

Nov 23,2023 10:33
sfi oppose communalisation of books

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పాఠ్య పుస్తకాల్లో చరిత్రను వక్రీకరిస్తూ తీసుకొచ్చిన సిఫార్సులు వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కె ప్రసన్నకుమార్‌, ఎ అశోక్‌ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నూతన విద్యా విధానం (ఎన్‌ఇపి)తో విద్యారంగంలో కొత్త మార్పు తీసుకొస్తామంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాన్ని బిజెపి అమలు చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. చరిత్ర పాఠ్యాంశాల్లో క్లాసికల్‌ విభాగం కింద రామాయణం, మహాభారతం, ఆయుర్వేద వంటి తిరోగమన భావాలను చిన్నపిల్లల మెదడులో మతోన్మాదాన్ని రెచ్చగొట్టి మనువాదాన్ని జోప్పించడం రాజ్యాగాంనికి విరుద్ధమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పాఠ్యపుస్తకాల్లో రామాయణం, మహాభారతం వంటివి చేర్చాలని ఎన్‌సిఇఆర్‌టి సిఫార్సు చేయడాన్ని ప్రజాస్వామ్య వాదులు ఖండించాలని కోరారు. ఉన్నత స్థాయి కమిటీ ఇలాంటి నిర్ణయాలు చేయడం వల్ల సమాజానికి ముఖ్యంగా విద్యార్థులకు తీవ్ర నష్టమని తెలిపారు. తక్షణమే ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని, లేదంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

➡️