ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో, కావలి రూరల్ తిరుపతి, నెల్లూరులో జిల్లాల్లో శుక్రవారం జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మరణించారు. నిశ్చాతార్థానికి వెళ్లి వస్తుండగా కళాశాల బస్సును కారు ఢకొీన్ని తిరుపతి జిల్లాలో నలుగురు, తిరుమల శ్రీవారి దర్శనానంతరం తిరిగి ఇంటికి వస్తుండగా ఓ మహిళను తప్పించబోయి కంటైనర్‌ను కారు ఢకొీన్ని నెల్లూరు జిల్లాలో ముగ్గురు మరణించారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం…తిరుపతి జిల్లా పుత్తూరు మండలం పరమేశ్వర మంగళం గ్రామం రమేష్ నాయుడు కుటుంబానికి చెందిన ఐదుగురు తమ బంధువు నిశ్చితార్థానికి కారులో పెరంబురు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో తిరుపతి జిల్లా నారాయణవనం పోలీసుస్టేషన్ సమీపంలో ముందు వెళ్తున్న వాహనాన్ని అధిగమించబోయి ఎదురుగా వస్తున్న ప్రయివేట్ డిగ్రీ కళాశాల బస్సును కారు ఢకొీన్నది. ఈ ప్రమాదంలో రమేష్ నాయుడు (60), ఆయన భార్య పుష్ప (55), బంధువులు భాను (42), వదిన వనజాక్షమ్మ అలియాస్ అమ్ములమ్మ (60) అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన శివమ్మను తిరుపతి రుయాకు తరలించారు.విజయవాడలోని భవానీపురంలో నివాసముంటున్న బైపాని జీవన్ కుమార్, సునీత దంపతుల కుమారుడికి, హైదరాబాద్‌లోని మహంకాళి లక్ష్మీనరసింహారావు కుమార్తెకు ఇటీవల వివాహమైంది. శ్రీవారి దర్శనార్థం అందరూ కలిసి రెండు కార్లలో హైదరాబాద్ నుంచి తిరుపతికి వచ్చారు. శ్రీవారి దర్శనం అనంతరం విజయవాడకు బయలుదేరారు. నెల్లూరు జిల్లా మద్దూరుపాడు జాతీయ రహదారి చెన్నాయపాలెం క్రాస్ రోడ్డు వద్దకు రాగానే కారు అదుపు తప్పి తొలుత ఓ మహిళను ఆ తర్వాత కంటైనర్‌ను ఢ కొట్టింది. ఈ ప్రమాదంలో మద్దూరుపాడు గ్రామానికి చెందిన సుబ్బమ్మ (64), పెళ్లి కుమారుడు తండ్రి జీవన్‌కుమార్ (50), తల్లి సునీత (50) అక్కడికక్కడే మరణించారు. పెళ్లికుమారుడు, పెళ్లి కుమార్తె వారి తల్లిదండ్రులు మరో కారులో వస్తుండడంతో వారికి ఏలాంటి ప్రమాదమూ జరగలేదు.