విభజన హామీలు, విశాఖ, కడప స్టీల్‌ప్లాంట్లపై నాటకాలు ఆపండి

Nov 22,2023 22:01 #cpm v srinivasarao, #press meet

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై వి శ్రీనివాసరావు
ప్రజాశక్తిా గ్రేటర్‌ విశాఖ బ్యూరో, ఎంవిపి.కాలనీ
ఎపి విభజన హామీలు, కడప, వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్లు, విశాఖకు దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ వంటి విషయాల్లో కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని వైసిపి నాటకాలు కట్టిపెట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. విశాఖలోని ఎన్‌పిఆర్‌ భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖ నగరం వరుస ప్రమాదాలు, మత్స్యకారుల బోట్లు మంటల్లో దగ్ధం కావడం, స్కూలు పిల్లల వాహనాలు ప్రమాదాలకు గురికావడం వంటి ఘటనలతో విషాదంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికవర్గం చేస్తోన్న పోరాట ఫలితంగా వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ విషయంలో కేంద్రం ఒక్క అడుగూ ముందుకు వేయలేకపోయిందని తెలిపారు. అయినప్పటికీ ప్లాంట్‌ ఊపిరి తీసే విధంగా బ్లాస్ట్‌ ఫర్నేస్‌ను మూసెయ్యడం, ఐరన్‌ ఓర్‌, కోల్‌ రాకుండా అడ్డుకోవడం వంటి చర్యలతో ఉత్పత్తి సామర్థ్యాన్ని బలహీనపరచాలని చూస్తోందన్నారు. ఆ చర్యలను సిపిఎం తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. బిజెపి రాజ్యసభ సభ్యులు జివిఎల్‌.నరసింహారావు స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ ఆగిపోయిందంటూ విశాఖ వేదికగా కపట ప్రకటనలు చేస్తూ జనాల చెవిలో పువ్వులు పెడదామని చూశారని, ఆయన ఆటలు సాగవని అన్నారు. కేంద్రంలో బిజెపిని 2024 ఎన్నికల్లో అధికారంలోకి రాకుండా చేస్తేనే వైజాగ్‌ స్టీల్‌ ప్రయివేటీకరణ ఆగుతుందని తెలిపారు.
విభజన హామీలపై ఢిల్లీ డ్రామాలెందుకు జగన్‌?
విభజన హామీలపై చీఫ్‌ సెక్రటరీ ఆధ్వర్యాన కమిటీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీకి పంపడం ఎన్నికల ముందు దేనికని వి.శ్రీనివాసరావు ప్రశ్నించారు. విభజన హామీల్లో భాగంగా కడప స్టీల్‌ప్లాంట్‌ను కేంద్రం నిర్మించాల్సి ఉండగా, దానిపై ఒత్తిడి తేకుండా గతంలో జిందాల్‌ బృందంతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేయించడం మోసం కాదా? అని నిలదీశారు. కడప ప్రజలకు జగన్‌ ద్రోహం తలపెడుతున్నారన్నారు. రైల్వే జోన్‌పై బిజెపి నేతలైన జివిఎల్‌ వంటి వారు రోజుకో మోసపు ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. రైళ్లు వేసేస్తామంటూ వారు ఇస్తున్న ప్రకటనలు హాస్యాస్పదంగా ఉన్నాయని, వాస్తవానికి ప్రజలు ప్రయాణించేందుకు రైళ్లు విశాఖ నుంచి సక్రమంగా లేవని అన్నారు. విశాఖలో రైల్వే జోన్‌ అంశంపైనా కేంద్రం నాటకాలాడుతోందని, రైల్వే జోన్‌కు భవనం లేదనడం సరైంది కాదని తెలిపారు. సొంత స్వార్థ రాజకీయాల కోసం కేంద్రం వద్ద వైసిపి మోకరిల్లి కంటితుడుపు ప్రకటనలను ఎన్నికల ముందు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. విశాఖలో పంచ గ్రామాల సమస్యను పరిష్కరించకుండా నివాసం ఉండే వారు ఇళ్లు రిపేర్లు చేసుకోవచ్చని ప్రభుత్వం చేసిన ప్రకటన సరైంది కాదన్నారు. అక్కడి వారేమీ దురాక్రమణ చేసిన వారు కాదని తెలిపారు. కేంద్రం ధాన్యానికి రూ.2,800 ఇస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.2,060 చెల్లిస్తోందని, ఇది సరైంది కాదని అన్నారు. అప్పుల పాలైన రైతులకు రైతు భరోసా ఏమూలకొస్తుందని ప్రశ్నించారు. ఆ మొత్తంతో రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడదని తెలిపారు. విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో బోట్లు దగ్ధమైన ఘటనపై నిపుణుల కమిటీతో సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం, విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు పాల్గొన్నారు.
బోట్ల యజమానులకు పూర్తి స్థాయి నష్టపరిహారం చెల్లించాలి
ఇటీవల ఫిషింగ్‌ హార్బర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో బోట్లు కాలిపోయిన యజమానులకు పూర్తి స్థాయి నష్టపరిహారం చెల్లించాలని, బోట్లపై ఆధారపడి జీవిస్తున్న కళాసీలకు, చిరు వ్యాపారులకు భృతి చెల్లించాలని వి.శ్రీనివాసరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఫిషింగ్‌ హార్బర్‌లో భద్రతా చర్యలు, నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని కోరారు. ఫిషింగ్‌ హార్బర్‌లో ఇటీవల ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సిపిఎం నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. బాధితులను పరామర్శించారు. అనంతరం వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ బోటు కోల్పోయిన వారికి బోటు ఇవ్వాలని, అందులోని డీజిల్‌, వల, వంట సామగ్రి వంటి ఇతరత్రా వాటికి కూడా లెక్కగట్టి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. మత్స్యవేటతో సంబంధం ఉన్న నిపుణులతో కమిటీ వేసి నష్టాన్ని అంచనా కట్టాలన్నారు. హార్బర్‌లో నిఘా వ్యవస్థ లోపభూయిష్టంగా ఉండడంపై ఆందోళన వ్యక్తం చేశారు.

➡️