ఇంకా చాలా కేసులు ఉన్నాయి.. బెయిల్‌ వస్తే నిర్దోషి కాదు : సజ్జల రామకృష్ణారెడ్డి

Nov 20,2023 21:11 #Sajjala Ramakrishna Reddy

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కేసులో బెయిల్‌ వచ్చినంత మాత్రాన నిర్ధోషికాదని, ఆయనపై మద్యం, ఫైబర్‌నెట్‌, ఇసుక, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, అసైన్‌మెంట్‌ భూముల కేసులు వున్నాయని ఈ కేసులను ఎదుర్కోవాలనే అంశాన్ని తెలుగుదేశం మర్చిపోవద్దని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. స్కిల్‌ కేసులో చంద్రబాబునాయుడుకు బెయిల్‌ రాగానే తెలుగుదేశం తమ నాయకుడు తప్పు చేయలేనందునే బెయిల్‌ వచ్చిందని హడావుడి చేస్తోందని విమర్శించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ ఎలా జరిగిందో ఆధారాలను సిఐడి తరుపు లాయర్లు కోర్టుకు నివేదించారని అన్నారు. ప్రజల సొమ్మును షెల్‌ కంపెనీల పేరుతో దోచేశారని కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థలు నివేదిక ఇచ్చాయని అన్నారు. ఐటిశాఖ నోటీసులతో ఈ స్కామ్‌ వెలుగులోకి వచ్చిందన్నారు. ప్రభుత్వానికి సంబందంలేని గంటా సుబ్బారావును ఐదు పదవుల్లో కూర్చోబెట్టి నిధులను కాజేసేందుకు కుట్రలు చేశారని విమర్శించారు. చంద్రబాబునాయుడు త్వరలో విజయయాత్ర చేస్తామంటున్నారని, అనారోగ్యంగా వుంటే ఎలా చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు.

➡️