విశాఖపట్నం : విశాఖపట్నంలో ఫిషింగ్ హార్బర్‌లో బోట్ల దగ్ధం ఘటనపై లోతైన దర్యాప్తు జరిపి కారణాలు వెలికితీయాలని సిఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఆదివారం రాత్రి విశాఖ ఫిషింగ్ హర్టబర్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 40కి పైగా బోట్లు కాలిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది. దీనిపై సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. విశాఖపట్నంలో ఫిషింగ్ హార్బర్‌లో బోట్లు దగ్ధమైన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బాధితులను ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంపై లోతైన దర్యాప్తు జరిపి కారణాలు వెలికితీయాలని, మంత్రి సీదిరి అప్పలరాజును ఘటనాస్థలానికి వెళ్లాలని సూచించారు. బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు అండగా ఉండాలని, తగిన విధంగా వారికి సహాయం చేయాలని వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. అగ్ని ప్రమాదం ఘటనలో ఓ యూట్యూబర్‌పై కేసు నమోదు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఆదివారం రాత్రి ఫిషింగ్ హార్బర్‌లో యూట్యూబర్ పార్టీ ఇచ్చినట్లు, మద్యం మత్తులో గొడవ జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం యూట్యూబర్ పరారీలోఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక అగ్ని ప్రమాదంపై పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనా స్థలంలో ఎస్పీ వివరాలు సేకరిస్తున్నారు. ఉద్దేశ పూర్వకంగా ప్రమాదం జరిగిందా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. మరోవైపు ఐదు గంటలు పాటు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.